Jhund Movie Review: ఝుండ్ (హిందీ)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటులు: అమితాబ్ బచ్చన్, ఆకాశ్ తోసర్, రింకూ రాజ్ గురు, కిశోర్ కదమ్, తానాజీ గల్గుండే, సోమ్ నాథ్ అవఘడే, విక్కీ కద్రాన్, గణేశ్ దేశ్ ముఖ్, అభినయ్ రాజ్ సింగ్
సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యెక్కంటి
సంగీతం: అజయ్-అతుల్; నేపథ్య సంగీతం: సాకేత్ కనెత్కర్
నిర్మాతలు: భూషణ్ కుమార్ (టి-సిరీస్ గుల్షన్ కుమార్ తనయుడు), క్రిషన్ కుమార్, రాజ్ హిరేమఠ్, సవితా రాజ్ హిరేమఠ్, నాగ్ రాజ్ మంజులే, గార్గీ కులకర్ణి, మీనూ అరోరా
రచన, దర్శకత్వం: నాగ్ రాజ్ మంజులే
‘ఝుండ్’ అంటే ‘మంద’ అని అర్థం. ఓ గొర్రె ఎలా పోతుంటే, మిగిలిన గొర్రెలు అలాగే పోతాయని సామెత. అదే తీరున స్లమ్ ఏరియాలోని కొందరు కుర్రాళ్ళు చిన్నతనంలోనే సరైన ఆలనాపాలనా లేక చెడుదారుల్లో తిరుగుతూ ఉంటారు. మాదకద్రవ్యాలకు వ్యసనపరులైన వారు కొందరు, బ్రతుకు తెరువు కోసం చెడుదారుల్లో నడిచేవారు మరికొందరు, జల్సాల కోసం ఆడవాళ్ళ మెడలోని గొలుసులు కొట్టేసేవారు ఇంకొందరు -ఇలా మురికివాడల్లో నివసించే వారి జీవితాలను చూసి, అందరూ అసహ్యించుకొనేవారే! కానీ, వారు అలా మారడానికి కారణాలేంటి? వారిని తగిన దారిలో నడిచేలా చేస్తే, వారు సైతం బాధ్యతగల పౌరులు కాగలరని చెప్పే కథతో ఈ ‘ఝుండ్’ తెరకెక్కింది.
బడుగువర్గాలు, వారి జీవితాల్లోని పలు కోణాలను ఆధారం చేసుకొని చిత్రాలు రూపొందించడంలో మేటి అనిపించుకున్నారు మరాఠీ దర్శకరచయిత నాగ్ రాజ్ పొపట్ రావ్ మంజులే. ఈయన తెరకెక్కించిన అనేక చిత్రాలు జనాన్ని ఆలోచింపచేశాయి. ప్రభుత్వ అవార్డులూ, ప్రేక్షకుల రివార్డులూ అందుకున్నాయి. ముఖ్యంగా నాగ్ రాజ్ మంజులే తెరకెక్కించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’ సంచలన విజయం సాధించింది. మరాఠీలో టాప్ హీరోస్ మూవీస్ కన్నా మిన్నగా అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించిందీ సినిమా. ఈ ‘సైరాట్’ ఆధారంగానే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ‘దఢక్’ తెరకెక్కింది. కరోనా కల్లోలంలో ఛిద్రమైన జీవితాలు, పరిణామం ఆధారంగా నాగ్ రాజ్ మంజులే ‘అన్ పాజ్‌డ్ : నయా సఫర్’ అనే హిందీ సీరియల్ తెరకెక్కించారు. ఆ సీరియల్ సైతం అందరినీ ఆలోచింప చేసింది. నాగ్ రాజ్ మంజులే దర్శకత్వంలో తొలిసారి ‘ఝుండ్’ హిందీ చిత్రం రూపొందింది.
Also Read
ఇక ‘ఝుండ్’ కథలోకి తొంగిచూస్తే.. ఈ కథను కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే రూపొందించారు నాగ్ రాజ్ మంజులే. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన విజయ్ బర్సే అనే స్పోర్ట్స్ టీచర్ రిటైర్ అయిన తరువాత ఓ యన్.జి.వో. నెలకొల్పారు. దాని పేరు ‘స్లమ్ సాకర్’ అని పెట్టారు. అందులో నేరాలు, ఘోరాలూ చేస్తూ రక్షణ కోసం ఉరుకుల పరుగులు తీసేవారిని పట్టుకొని, వారిని చక్కదిద్ది, వారిలో క్రీడాస్ఫూర్తిని నింపి, వ్యసనాలకు దూరం చేసి తాను కోరుకున్న ‘స్లమ్ సాకర్’ టీమ్ ను తయారు చేశారు. వారితో పలు స్థాయిల్లో ఫుట్ బాల్ ఆట ఆడించి విజయాలు సాధించారు. ఈ స్ఫూర్తి ప్రదాత ఇంటర్వ్యూతోనే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 2012లో తాను నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమాన్ని ఆరంభించడం విశేషం! విజయ్ బర్సే కథ ఆధారంగానే ‘ఝుండ్’ రూపొందింది. ఇందులో విజయ్ బర్సే పాత్రను అమితాబ్ బచ్చన్ ధరించారు.
నిజానికి ఇది వాస్తవ కథనే అయినా, గతంలోనూ క్రీడానేపథ్యంలో రూపొందిన కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలు మురికివాడల నుండి వచ్చి కీర్తిప్రతిష్ఠలు గడించిన వైనం కనిపిస్తుంది. కొన్నిట నేరచరిత్ర కలిగి స్ఫూర్తి చెంది క్రీడల్లో రాణించిన కథలూ ఉన్నాయి. అలాంటి కథలతో తెలుగులోనూ పరుగుల రాణి అశ్వనీ నాచప్ప జీవిత కథతో ‘అశ్వనీ’ తెరకెక్కింది. ఆ మధ్య పర్హాన్ అక్థర్ నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ రూపొందింది. డాన్స్ నేపథ్యంలో రూపొందిన కొన్ని చిత్రాలూ గుర్తుకు వస్తాయి. అన్నిటినీ మించి చిన్నవయసులోనే నేరస్థులుగా మారిన వారిలో పరివర్తన కలిగేలా చేసే సన్నివేశాలు అవి చూస్తే వి.శాంతారామ్ తెరకెక్కించిన కళాఖండం ‘దో ఆంఖే బారా హాత్’ కూడా గుర్తుకు రాకమానదు.
ఇక ప్రస్తుతం దేశంలో అట్టడుగు వర్గాల వారి మనసుల్లో నెలకొన్న మనోభావాలను సైతం దర్శకుడు కథలో చొప్పించినట్టు కనిపిస్తుంది. ‘జై భీమ్…’ నినాదాలు, నేపథ్యంలో కనిపించే బాబా సాహెబ్ అంబేద్కర్ పోస్టర్స్, అజయ్- అతుల్ దరువులు చూస్తే ఓ సామాజిక వర్గం నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఇట్టే అర్థమై పోతుంది. తన కథకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో మంజులే నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ కు ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగల శక్తి ఉంది. అందువల్ల ఆయన నటనలో విజయ్ బర్సేనే తెరపై కనిపిస్తారు. మంజులే ‘సైరాట్’లో జోడీగా నటించి అలరించిన ఆకాశ్ తోసర్, రింకూ రాజ్ గురు ఇందులోనూ తమదైన అభినయంతో అలరించారు. ఇతర పాత్రల నుండీ తనకు తగ్గ అభినయాన్ని రాబట్టుకోగలిగారు మంజులే. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో కానీ, ఆఫ్ బీట్ మూవీస్ ఇష్టపడేవారిని అలరిస్తుందని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
అమితాబ్ బచ్చన్ అభినయం
ఇతర నటీనటుల నటన
దర్శకత్వ ప్రతిభ
మైనస్ పాయింట్స్:
సహజత్వం కోసం సాగదీసిన సీన్స్
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: ‘ఝుండ్’ ఆడిన ఆట!
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!