హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని.. 27శాతం కుంగిపోయిందని.. కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని.. లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్‌రాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ మూడేళ్ల క్రితమే.. NTV చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ.. రియల్ ఎస్టేట్ పతనంపై NTV ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ అదే ప్రతిరోజు నిజమవుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే.. దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారిగా వచ్చిన బూమ్.. కచ్చితంగా ఎప్పుడోసారి బరస్ట్ అవుతుందనే ఆందోళన ఉంటుంది.డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు తగ్గాయో.. నిర్మాణాలు పూర్తై ఏళ్లు గడుస్తున్నా.. వందల సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయో.. అప్పుడు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచైన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్లు అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చాలా కష్టపడి కస్టమర్లను సైట్ కు తీసుకొచ్చినా.. వారితో ఇల్లు కొనిపించేసరికి తల ప్రాణం తోకకు వస్తుందని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ పతనమనేది ఒక సైక్లిక్ ఆర్డర్లో జరుగుతుంది. 2005 – 2006లో ఒకసారి ఈ పతనాన్ని చూసాం. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలకుపైగా 2009-10 వరకు అది కొనసాగింది. రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవరూ కోరుకోరు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే.. అనుబంధ వ్యాపారాలన్నీ పరుగులు పెడతాయి. కానీ, వాస్తవాలను గాలికొదిలేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు చేసిన స్వయంకృతాపరాధాలే ఈరోజు అందరికీ శాపంగా మారాయి. మరో మూడేళ్ల వరకు ఈ పతనం ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడైనా.. రియల్ ఎస్టేట్ డౌన్‌కు కారణాలు విశ్లేషించి పరిష్కారాలు వెతుక్కుంటేనే ఎక్కడో చోట పరిస్థితి మెరుగవుతుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సప్లై, డిమాండ్ ఫార్ములాని వదిలేసింది. అసలు ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు. ప్రతియేటా ఎంతమంది ప్రజలు వస్తున్నారు. కొత్త ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి. ప్రజలకు కొత్త నిర్మాణాల అవసరం ఎంత ఉంది. కొత్త బయ్యర్ అనేవాడు ఎవరూ.. సిటీ కెపాసిటీ ఎంత.. ఏమి అంచనా వేయకుండా.. పట్టించుకోకుండా ఇబ్బడిముబ్బడిగా నిర్మాణాలు చేసి… బిల్డర్లు వాళ్లని వాళ్లే పతనం చేసుకున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో గతంలో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్‌లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. కొనుగోలు దారుల ప్రియార్టీలను పట్టీంచుకోండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లు ఇప్పుడు అమ్ముడు పోకపోవడంతో హైదరాబాద్ లో రియల్టర్లు ఇప్పుడు దిక్కు తోచని స్థితి లో పడ్దారు.
దశాబ్దకాలంగా ఎన్నడు లేని విధంగా IT బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటు..తో పాటు అనే క కారణాల వల్ల.అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాదు కేంద్రంగా మారింది.ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపరులు తమ రియాల్టీకు అనుకూలంగా మలుచుకుని.. ఎన్నడు లేనంతగా అపార్ట్మెంట్ లు..ఇండివిడ్యువల్ హౌస్ లనిర్మాణాలను పెంచేసారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా వుండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్ లు విఫలమయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక రంగాల పరిస్థితి తారుమారు అయ్యిందన్నది ఓపెన్ సీక్రెట్..అయితే హైదరాబాదు లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ ల అమ్మకాలు దుమ్ము దులిపాయన్న ఓవర్ పబ్లిసిటీ తో గ్రేటర్ లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు..ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో మిడిల్ క్లాస్..ఎబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంతి ఇంటికలను నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఓప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడమ్ కామన్..కానీ హైదరాబాదు రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి.. భూమి పూజలు చేసి..పిల్లర్లు..లేపి అడ్వాన్స్ లు తీసుకోవడం తో సరిపెట్టారు కొంతమంది. మరి కొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు.. ఇక బడా రియాల్టీ బాసులైతే చెప్పినవన్ని పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడం లో వెనుకబడ్డారు.ఇళ్లు కొనేవారు లేక, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కిరాక.. రియల్ కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి.
అవసరానికి మించి అడ్డు అదుపులేకుండా నిర్మాణాలు చేసారు. అప్పటి ప్రభుత్వం కూడా.. ఎలా పడితే అలా అనుమతిచ్చింది. అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కింది. ఫిక్సెడ్ సేల్స్ ఇండెక్స్ నియంత్రణ ఎత్తివేసి.. ఎవరు ఎన్ని ఫ్లోర్లు అయినా కట్టుకొవచ్చంటూ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా.. భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా.. కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా.. పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు.
హైదరాబాద్‌లో కోటి మంది జనానికి 30లక్షల మంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. సుమారు 7 నుంచి 8లక్షల అపార్టుమెంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండేవాళ్లలో స్థానికులు తక్కువ. ఇక్కడ స్థిరపడినవాళ్లే ఎక్కువ. వీళ్లంతా నివసించడానికి అపార్టుమెంట్లు కొనుక్కున్నారు. కొందరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఈ లెక్క అంచనా తప్పింది. ఇంకా జనం ఎక్కువగా అపార్ట్మెంట్లు విపరీతంగా కొంటారనే అత్యాశతో అడ్డు అదుపులేకుండా నిర్మాణాలు చేసారు. రియల్ బూమ్ బాగుందనే కారణంతో.. కొందరు బిల్డర్లు అతిగా ఆశపడి.. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పడిపోవడంతో.. పెంచిన రేట్లు తగ్గించలేక.. కట్టిన ఇళ్లు అమ్ముడుపోక.. అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డు దగ్గర్నుంచీ రీజినల్ రింగ్ రోడ్ అవతలి వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు భారీ అంతస్తుల్ని ఫ్యాషన్ గా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణాలంటే అందరిలో మొహం మొత్తిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకేచోట వందల సంఖ్యలో ఫ్లాట్లు.. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు చూడటానికి బాగానే ఉన్నా.. నివాసానికి వచ్చేసరికి వాస్తవ కష్టాలు బోధపడుతున్నాయనేవాళ్లూ ఉన్నారు. ప్రతిదానికీ అన్ని అంతస్తులు కిందకి దిగడం చాలా మందికి కష్టంగా ఉంటోంది. ఎంత లిఫ్ట్ ఉన్నా.. నెలనెలా మెయింటైన్స్ పేరుతో వేస్తున్న బాదుడుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే ఫ్లాట్ ఓనర్లుగా ఉన్న వారి అనుభవాలు చూసి.. చాలా మంది మరీ పై అంతస్తులో ఉన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు అదే పతనానికి కారణమైంది.
హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్ లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా.. వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల SFT ఖాళీగా పడివుంది. కొత్త కన్స్ట్రక్షన్కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్నిరకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బీ లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్ లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా.. రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా.. అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. అమ్మడుపోని ఫ్లాట్ల కథ ఇలా ఉంటే.. అమ్ముడైన ఇళ్లకు కూడా సరైన అద్దెలు రావడం లేదని కొనుగోలుదారులు మొత్తుకుంటున్నారు. కొనేటప్పుడు వేసుకున్న అంచనాలకు.. అద్దెకిచ్చేటప్పుడు వస్తున్న ఆదాయానికి.. ఎక్కడా పొంతన కుదరడం లేదు. అద్దెల విషయంలో మరీ పట్టుదలకు పోతే.. నెలల తరబడి ఇళ్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి.
అందుకే ఇప్పటికైనా బిల్డర్లు నిర్మాణాలను తగ్గించాలి. నిలిచిపోయిన వాటిలో కనీసం 70శాతం సేల్స్ అయ్యే వరకు కన్స్ట్రక్షన్ నిలిపివేస్తే.. ఇండస్ట్రీ కుదుటపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్యకర వ్యాపార విధానాలకు మళ్లాలి. రియల్టర్లు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోకుండా పరిష్కార మార్గాలు తట్టే అవకాశం లేదు. సమస్య ఏంటో క్లియర్ గా తెలిసిన తర్వాత కూడా మొండిగా ముందుకెళ్తే.. అంతిమంగా నష్టాలే మిగులుతాయని గుర్తించుకోవాలి.
రియల్ ఎస్టేట్ పతనానికి అడ్డు అదుపులేని అపార్ట్మెంట్ రేట్లు కూడా కారణమే. SFT పదివేల రూపాయలు పెడితే.. ఒక మధ్యతరగతి వాడు కొనగలడా..? రెండు వేల SFT అపార్ట్మెంట్.. 10వేల రూపాయల రేట్ లెక్కన కొంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. దీంతో 15శాతం అంటే 30లక్షలు మార్జిన్ మనీ చేతిలో పెట్టుకుని.. 85 శాతం.. అంటే కోటి 70లక్షలు బ్యాంకు లోను తెచ్చుకుంటే.. ఆ మధ్యతరగతి వాడు వడ్డీలు కట్టుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఈ బ్యాంకు లోన్ ఎప్పటికీ తీర్చగలుగుతాడు. ఓవరాల్‌గా అప్పు తీరేటప్పటికి వడ్డీతో సహా మొత్తం రూ.3కోట్లు అవుతుంది. అంటే EMIకి.. ఫ్లాట్ కాస్ట్‌కు మ్యాచ్ కావడం లేదు. అందుకే మధ్య తరగతి ప్రజలు అపార్టుమెంట్ కొనడం మానేశారు. అలాగే రెండో అపార్ట్మెంట్ కొనాలనేకునేవాళ్లు కూడా తగ్గిపోయారు. చేతిలో ఉన్న నాలుగు డబ్బులతో బంగారం కొనుక్కుంటే.. అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు.
ప్రజల జీవనప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను.. ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా.. మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ కు ముందుకు రావడం లేదు. కరోనా తర్వాత అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. నాలుగు డబ్బులు చేతిలో ఉంటే నయం కదా.. ఎన్ని ఆస్తులున్నా.. అవసరానికి అమ్ముడుపోతాయా అనే ఆలోచనా ధోరణి మొదలైంది. దీంతో రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని.. ప్లాన్ చేస్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్పులిచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు.ముడి సరుకు. సిమెంట్, స్టీలు వంటివాటి ధరలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్టుమెంట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులకు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. నిధులు సమకూర్చుకోలేకపోవడంతో లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ రుణాలను నిరర్థక ఆస్తులుగా ఎక్కడ ప్రకటిస్తారేమోనని భయపడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
అసలు హైదరాబాద్ లో రూ.60 లక్షల లోపు అపార్ట్ మెంట్లు ఎక్కడా లేవు. ఏ ఏరియా చూసుకున్నా.. ఇంతకన్నా తక్కువ రేటుకు ఇల్లు రావడం లేదు. నిర్మాణ వ్యయం చూసుకున్నా.. సాధారణ క్వాలిటీకి కూడా చదరపు అడుగుకు రూ.3 వేలు అవుతుంది. ఇక దీనికి ల్యాండ్ కాస్ట్ కలిపితే చదరపు అడుగుకు రూ.4 వేలు అవుతుంది. తక్కువ మార్జిన్ మాస్ హౌసింగ్‌ను నిర్మించడానికి డెవలపర్లు ఎక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేయడం సవాల్‌గా మారుతోంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇతర ఇన్పుట్ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగాయి. అందుబాటు ధరలో హౌసింగ్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం ఆకర్షణీయంగా లేదు. అలాగని ఎక్కువరేట్లు పెట్టే కొనే పరిస్థితి కూడా లేదు. దీంతో రియల్ మార్కెట్లో అయోమయం నెలకొంది.
హైదరాబాద్‌లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే ఇళ్ల ధరలు తక్కువ అని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు ఇదివరకు తరచూ చెబుతుండేవారు. మనది అందుబాటు ధరల మార్కెట్ అని బిల్డర్లు గర్వంగా చెప్పేవారు. కొన్నాళ్లుగా సిటీలో పరిస్థితులు చూస్తుంటే అందుబాటు ధరల్లో ఇళ్లు అనే ట్యాగ్‌లైన్‌కు హైదరాబాద్ క్రమంగా దూరమవుతోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వినియోగదారుల్లో కొన్ని వర్గాలు చాలాకాలంగా ఇదే భావన వ్యక్తం చేయగా.. తాజాగా నిర్మాణ సంఘాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఏ బిజినెస్ కు అయినా డిమాండ్, సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే.. రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువగా రేటు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటివరకు హైదరాబాద్ లో డిమాండ్ కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి.. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించేవాళ్లు బిల్డర్లు. కానీ గత మూడేళ్లుగా ఈ పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది కదా అని.. డిమాండ్ ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి.. అవుటర్ రింగ్ రోడ్డు అవతల వరకూ వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా అవుటర్ రింగ్ రోడ్డు అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఊదరగొట్టారు. కానీ ఇవన్నీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్ మెంట్లు దాదాపుగా పూర్తైపోయాయి. ఇప్పుడు రెండు, మూడు ఇన్వెస్ట్ మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బుల్లేవు. ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించటం లేదు. కనీసం మంచిరోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస అవసరాలు తీర్చుకోవటమే కష్టంగా ఉంది. ఇక ఇళ్ల కొనుగోలు గురించి ఆలోచించే సీన్ ఎక్కడుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
అలాగని హైదరాబాద్ లో ఇళ్లు కావాల్సిన వాళ్లు లేరని కాదు. వారి కెపాసిటీకి, మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరటం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేం లే అని మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మపదార్థమే. అంత త్వరగా అందరికీ కొరుకొడుపడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్ తో జోరందుకున్న రియల్ ఎస్టేట్.. క్రమంగా ఇన్వెస్ట్ మెంట్ కు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్ పై అవగాహన పెరిగిన మాట నిజం. పదేళ్ల క్రితంతో పోలిస్తే.. ఎస్ఎఫ్టీ, ఫ్లాట్ , బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమౌతున్నాయి. చదరపు అడగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు.. ఎవరు ఫిక్స్ చేస్తారు.. ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్లు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.
సొంతిల్లు అందరికీ కలే. కానీ దాని కోసం నేల విడిచి సాము చేయటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంక్ లోన్ తీసుకోవటానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయనడంలో సందేహం లేదు. SFT కన్స్ట్రక్షన్ కాస్ట్.. ఎంత బాగా కట్టినా 4వేలకు మించదు. హైదరాబాద్ లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా.. రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా.. అవి కొనుగోలుదారుల్ని ఆకట్టుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. GHMC, HMDA పరిధిలో హైరైజ్ అపార్టుమెంట్లతో పాటు స్పెషల్ ఎమినిటీస్ ఉన్న అపార్ట్మెంట్లకు, గేటెడ్ కమ్యూనిటీ అంటూ మాయ చేసి కడుతున్న ఫ్లాట్స్ కు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు సామాన్యుడు కొనలేని విధంగా అపార్టుమెంట్ల ధరలను రియల్టర్లు సిండికేట్లుగా మారి పెంచడంతో హైదరాబాద్ లో అపార్టుమెంట్లు కొనడానికి జనం ఆసక్తి చూపట్లేదు. దీనికి తోడు చిన్న బిల్డర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా ఈ భారీ రేట్లను తగ్గించి..బిల్డర్లు అమ్మితేనే మళ్లీ శాలరీడ్ పర్సన్, మధ్యతరగతివాళ్లు అపార్ట్మెంట్లు కొంటారు. బిల్డర్లు మొండిగా బిగదీసుకుని.. మేము రేట్లు తగ్గించమంటే.. వాళ్లకు వచ్చేదంతా వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పటికీ కుదుటపడదని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.