Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
నాలుగేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమౌతున్న ప్రపంచానికి.. రెండు నెలల క్రితం మొదలైన ఇరాన్ యుద్ధం పులి మీద పుట్రలా పరిణమించింది. యుద్ధం దెబ్బకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. సరఫరా గొలుసులు తెగిపోయి.. అన్ని రంగాల మీదా ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చివరకు మన దేశం కూడా నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ స్థానం కోల్పోయి.. రెండడుగులు వెనక్కితగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్లలో మదుపర్ల లక్షల కోట్లు నష్టపోయారు. ఏతావాతా ఇరాన్ యుద్ధం దెబ్బకు ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
వరుస యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ ప్రభావం అన్ని దేశాలపైనా ఉంది. మనం మన ఊళ్లో బాగానే ఉన్నామని అనుకుంటాం. మనదేశంలో యుద్ధం లేదు కదా, మన ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఎందుకు వస్తుందని భావిస్తాం, కానీ గ్లోబల్ మార్కెట్ వ్యవస్థలో ఉన్న మనం.. ప్రపంచంలో ఏ మూల ఏ సమస్య వచ్చినా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, వాటికి ప్రభావితం కావాల్సిందే. ఎక్కడ ఏం జరిగినా, ఆ భారం అందరి మీద పడుతుంది. ఇప్పుడు జరిగింది అదే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరాచకం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెంపరితనం.. మొత్తంగా కలిసి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టేశాయి.
Also Read
యుద్ధంలో హౌతీల ప్రవేశంతో పాటు హర్మూజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ మార్గాలు దెబ్బతిన్నాయి, ఇది వస్తువుల కొరతకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, రోజుకు లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతోంది. అధిక ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి, ఇది ఆసియా, యూరప్ దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల భారత్ కూడా చమురు, ఆర్థిక రంగాల్లో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ యుద్ధం కేవలం ఇంధన ధరలనే కాకుండా, ఎరువులు, మందులు, సెమీ కండక్టర్లు, చిప్స్ సరఫరాను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ GDPకి సుమారు $97 బిలియన్ల నుండి $100 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 2025 చివరి నుండి తీవ్ర ఒత్తిడిలో ఉంది, ఇప్పుడు యుద్ధం కారణంగా మరింత పతనం వైపు వెళుతోంది.
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారు. చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఇరాన్ యుద్ధం జరిగిన రోజుల్లోనే కాకుండా.. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక పతనం ఆగడం లేదు.
ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా-ఇరాన్ యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్‌లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్‌లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ యుద్ధం కారణంగా రెండు స్థానాలు దిగజారి.. ఆరో స్థానానికి పడిపోయింది.
అంతేకాదు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.94 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన సెగ భారత్‌నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పిటకే ఆహార, ఆతిథ్య రంగాలు కుదేలయ్యాయి.
యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల జీడీపీకి గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్యధికంగా సుమారు 20-25 శాతం మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5 శాతం, అమెరికా జీడీపీకి 1.2 శాతం నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1 శాతం మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.
నాటో దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా నాటో దేశాల జీడీపీ 0.5 నుంచి 2 శాతం మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా నాటో దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా చైనాకు పెద్దగా నష్టం లేదని మొదట్లో వేసిన అంచనాలు కూడా తప్పాయి. చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు స్తంభించడంతో.. చైనా వాణిజ్య విధానంలోనూ గణనీయ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచ తయారీ కర్మాగారంగా పిలిచే చైనా నుంచి ఎగుమతులు తగ్గాయి. తాజా కస్టమ్స్ డేటా ప్రకారం.. మార్చి నెలలో చైనా ఎగుమతుల వృద్ధి గణనీయంగా తగ్గి.. కేవలం 2.5 శాతానికే పరిమితమైంది. గత 2 నెలల్లో ఏకంగా 21.8 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్కడితో పోలిస్తే మార్చిలో భారీగా తగ్గిందని చెప్పొచ్చు. మార్కెట్ అంచనాలు కూడా 8.5 శాతం వృద్ధి ఉంటుందని చెప్పగా.. అంచనాల్ని ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఇంకా గత 6 నెలల్లో కూడా ఇదే అత్యల్ప వృద్ధి. ఎగుమతుల వృద్ధి తగ్గినా.. దిగుమతులు మాత్రం అనూహ్యంగా పెరిగాయి. ఏడాదిలో 27.8 శాతం వృద్ధితో .. గత 4 సంవత్సరాల్లోనే అత్యధిక స్థాయిని నమోదు చేశాయి. ఇది కూడా మార్కెట్ అంచనాల్ని మించింది. ఇంధనం, ఇతర ముడి సరకుల ధరలు పెరగడం వల్ల దిగుమతుల ఖర్చులు భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం.. ఇదే సమయంలో దిగుమతుల బిల్లు పెరగడం.. చైనా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరంగా మారింది.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ సప్లై చెయిన్‌లో అంతరాయాలు ఏర్పడి.. ఇంధన ధరలు పెరగటం.. చైనా తయారీ రంగంపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. తయారీ ఖర్చులు పెరగడంతో.. ఉత్పత్తుల్లో పోటీ సామర్థ్యం తగ్గి ఇది ఎగుమతులపైనా ప్రభావం చూపుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థకు.. ఎగుమతులు కీలక వనరుగా ఉన్నాయి. గతేడాది మొత్తం ఆర్థిక వృద్ధిలో మూడో వంతు ఎగుమతుల నుంచే వచ్చింది. ఈ పరిస్థితుల్లో చైనా ఎగుమతులు తగ్గి.. దిగుమతులు పెరగడం చైనా ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడిని పెంచుతుంది. మరో ముఖ్యమైన విషయం.. అమెరికాతో చైనా ఎగుమతులు 26.5 శాతం తగ్గాయి. ఇక్కడ ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ దిగుమతి సుంకాలే కారణం. చైనా ఎగుమతుల్లో వృద్ధి మందగించేందుకు ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. అమెరికాతో ట్రేడ్ వార్ కారణంగా.. చైనా ఇతర ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. దక్షిణాసియా, లాటిన్ అమెరికా, యూరప్ వంటి దేశాలకు ఎగుమతుల్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ.. అంతర్జాతీయంగా అనిశ్చితి, యుద్ధ ప్రభావం కొనసాగడం వల్ల భవిష్యత్తులో మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కారణంగానే యుద్ధం నడుస్తోంది. మరోవైపు టారిఫ్స్ కూడా విధించింది ట్రంపే. దీంతో.. ట్రంప్ స్ట్రోక్ చైనాకు తగిలిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏతావాతా ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక శక్తులుగా పిలిచే దేశాలన్నింటినీ దెబ్బ కొట్టడం చిన్న విషయం కాదంటున్నారు నిపుణులు. ఏదో ఒక పెద్ద దేశంపై అయినా యుద్ధ ప్రభావం లేకుండా ఉంటే.. మిగతా ప్రపంచానికి ఆ దేశం ఆశాదీపంగా నిలిచే పరిస్థితి ఉండేది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తక్కువగా పడటంతో.. మనం ప్రపంచానికి ఆశారేఖగా నిలబడగలిగాం. కానీ ఇరాన్ యుద్ధం మనకే కాదు.. ఏ దేశానికీ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. పైగా రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితులు, ఊహించని సంక్షోభాలు.. ఆర్థిక శక్తుల్ని కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. టూకీగా చూస్తే.. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఉంది. చైనా కూడా మేడిపండు చందంగానే ఉంది. రష్యా కాస్త బాగున్నట్టు నివేదికలు చెబుతున్నా.. వాస్తవ చిత్రం వేరే ఉందనే వాదన లేకపోలేదు. ఇక యూరప్ దేశాలు ముందే కుదేలయ్యాయి. మనకు ఇంధన సంక్షోభం కారణంగా గట్టి దెబ్బే తగిలింది. ఎంత ప్రత్యామ్నాయాలు చూస్తున్నా.. ఇబ్బందులు తప్పటం లేదనేది.. సామాన్యులకు కూడా అనుభవంలో ఉన్న విషయమే. ఇక యుద్ధం ఆపటానికి జరిగే ప్రయత్నాలు కూడా సఫలం అవ్వకపోగా.. అంతకంతకూ సంక్లిష్టం కావడం భవిష్యత్తుపై భయాల్ని పెంచుతోంది.
యుద్ధం అమెరికా – ఇరాన్ మధ్య జరిగినప్పటికీ, దాని ప్రభావం.. గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేసింది. ఎగుమతులు, దిగుమతులను స్తంభింపజేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. చమురు సంక్షోభం వచ్చింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు మరియు సహజ వాయువు ధరలు 50 శాతం పైగా పెరిగాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.
చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే. ఇరాన్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల భవితవ్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. గల్ఫ్ బాధలు వర్ణనాతీతంగా మారాయి. సుసంపన్నమైన గల్ఫ్ దేశాలు.. ఇరాన్, అమెరికా యుద్దంతో బజారుపడ్డాయి. ఊహించనిస్థాయిలో అన్ని రంగాలు ప్రభావితం అయ్యాయి. చమురు, టూరిజం, రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ రంగాలు కుదేలయ్యాయి. చమురు కేంద్రాలు, రిఫైనరీలతో పాటు నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం.. గల్ఫ్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. యుద్ధంలో జరిగిన నష్టాన్ని భరించాలని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బెయిల్ ఔట్ ప్యాకేజీ డిమాండ్ చేసింది. మిగిలిన గల్ఫ్ దేశాలు ఆ బాటలో పయనించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల ఉమ్మడి జీడీపీలో సుమారు 5.2 శాతం నుంచి 8.5 శాతం యుద్ధంతో నష్టపోయింది. అంటే దీని విలువ 103 బిలియన్ డాలర్ల నుంచి 168బిలియన్ల డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ 8.5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల రూపాయలు. 2026 సంవత్సరానికి గల్ఫ్ దేశాల వృద్ధి రేటు మునుపటి అంచనాల కంటే 1.8 నుంచి 2.4 శాతం వరకు పడిపోయింది. యుద్ధం కారణంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ దేశాల చమురు ఉత్పత్తి రోజుకు 10 మిలియన్ బారెల్స్ వరకు తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 120 డాలర్ల మార్కును తాకింది.
దుబాయ్‌ని ప్రపంచ నగరంగా నిర్మించడానికి అక్కడి పాలకులు పాతికేళ్లకుపైగా శ్రమించారు. కానీ ఇప్పుడు యుద్ధం దెబ్బకు దశాబ్దాల కష్టం వృథా అయింది. దేశంలో పెట్రోల్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రత్నామ్నాయాలపై దృష్టి పెట్టారు. పర్యాటక, రియల్ ఎస్టేట్ , టెక్నాలజీ రంగాల వైపు మళ్లించడంలో గొప్ప విజయం సాధించింది. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్‌తో పని చేస్తున్నారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక కేంద్రాలలో దుబాయ్‌ని ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మంది కుబేరులు.. తమ కుటుంబాలతో సహా ఇక్కడ స్థిరపడ్డారు. కేవలం విలాసం కోసమే కాకుండా, పన్ను రాయితీలు, అద్భుతమైన మౌలిక సదుపాయాల కారణంగా ఇది అంతర్జాతీయ వ్యాపారాలకు ప్రధాన చిరునామాగా మారింది. దీంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు దుబాయ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో హోటల్స్ నిర్మించాయి. ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు వచ్చాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. పర్యాటక రంగం, హోటల్స్, షాపింగ్, సాఫ్ట్‌వేర్ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశాయి. విఐపీలు షాపింగ్ చేయలన్న, స్వచ్ఛమైన బంగారం కోనుగోలు చేయాలన్నా, ప్రపంచంలోని ప్రముఖులంతా అరబ్ కంట్రీస్‌లోనే వాలిపోయారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు..అందరూ షాపింగ్ కోసం అరబ్ కంట్రీస్‌కే వెళ్లారు. కానీ యుద్ధంతో సీన్ రివర్స్ అయింది. రోజుకి 50 వేల రూంలు బుక్కయితేనే ఈ నగరం మనగలుగుతుంది. ప్రస్తుతం యుద్దంతో
దుబాయ్‌లో అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. పునర్ వైభవం తీసుకురావాలంటే.. అక్కడి పాలకులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. అయితే ఎన్నాళ్లు పడుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సేఫ్ హెవన్‌గా పిలుచుకునే నగరం..యుద్ధంతో రూపు కోల్పోయింది. దుబాయ్ అత్యంత సురక్షితమైన అంతర్జాతీయ కేంద్రం. పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్. అంతకుమించిసురక్షితమైన నగరం. ఇదంతా యుద్ధానికి ముందు పరిస్థితి. ఇరాన్ ప్రతీకార దాడులకు దుబాయ్ కకావికలం అయింది. ప్రసిద్ధ కట్టడాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు దుబాయ్ ప్రతిష్ఠను మసకబారేలా చేశాయి. గతంలో పశ్చిమాసియా ప్రాంతంలోని అత్యంత సురక్షిత ప్రదేశంలో తాము పర్యటించబోతున్నామని పర్యాటకులు భావించారు. కానీ ఇరాన్ యుద్ధంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
యుద్ధం కారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 2 లక్షల 30 వేల 872 కోట్లు. దుబాయ్ రియల్టీ చరిత్రలో ఇవే అత్యధిక లావాదేవీలు. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6-9 శాతం మధ్య ఉంటుంది. దుబాయ్‌లోనే భారతీయులు ఎక్కువ మంది పెట్టుడులు పెడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా 20 నుంచి 22 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60-75 శాతం మేర పెరిగాయి. గతేడాది దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 1,34,945 కోట్లు.దుబాయ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే క్లయింట్లు డీల్స్‌పై వెనక్కి తగ్గుతున్నారు. చాలా మంది ఒప్పందాలు జాప్యం చేస్తున్నారు. సైట్ విజిట్స్ తగ్గాయి. లావాదేవీలు 30-40 శాతం పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్‌డ్ సేల్స్ భయంతో ఉన్నారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్ తగ్గాయి. పామ్ జుమైరా, దుబాయ్ మెరీనా హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్ బిజినెస్‌లో డైరెక్ట్ డ్యామేజ్ తక్కువే అయినా, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్‌లో పెట్టుబడిపెట్టిన ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గల్ఫ్‌లోని ప్రస్తుత పరిస్థితులతో రియల్ ఎస్టేట్, హోటల్, గోల్డ్ ట్రేడింగ్, మైనింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టిన భారతీయలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో సీక్రెట్ పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ గల్ఫ్‌కు జరిగిన ఆర్థిక నష్టం సంగతి పక్కనపెడితే.. కలిగిన విశ్వాస నష్టాన్ని ఎప్పటికైనా పూడ్చగలరా అనేది అతి పెద్ద ప్రశ్న. ఆధునిక ఆర్థిక అద్భుతంగా ఎదిగిన నగరాలు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోవడం.. గల్ఫ్ వాసులకు రక్తకన్నీరు మిగిలిస్తోంది. మళ్లీ ఆ స్థాయిలో నగరాలు ఏదోలా నిర్మించినా.. అప్పటి మాదిరిగా గల్ఫ్ సురక్షితం, పెట్టుబడులకు స్వర్గధామం అనే ఇమేజ్ ఎలా తేగలమనేది అరబ్ దేశాల ఆందోళనగా ఉంది. గల్ఫ్‌లో ఆఖరి యుద్ధం మూడు దశాబ్దాల క్రితం జరిగింది. అప్పట్నుంచి తమ ప్రాంతంలో యుద్ధం జరగకపోవడంతో.. గల్ఫ్ దేశాలు ఇన్నాళ్లూ ప్రశాంతంగా అభివృద్ధిపై దృష్టి సారించాయి. కానీ ఇకపై ఇదే ధోరణి కొనసాగించడం సాధ్యమేనా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలు తమ రక్షణ బడ్జెట్ పెంచుకోవాలని భావిస్తున్నాయి. అదే జరిగితే అభివృద్ధి కోసం చేసే ఖర్చులో ఎంతో కొంత కోత పడటం ఖాయమే. ఏతావాతా యుద్ధం గల్ఫ్ దృష్టికోణాన్ని మార్చేసిందని చెప్పడంలో సందేహం లేదు.
ఇరాన్ యుద్దం భారత్ కొంప ముంచుతోంది. ఈ వార్ కారణంగా ఇండియాకు ఊహించనంత నష్టం జరుగుతోంది. ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంటే.. మనదేశంలోని అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడుతోంది. చమురు నుంచి సబ్బుల దాకా.. ఔషధాల నుంచి ఎరువుల వరకు.. స్టీల్ నుంచి సిమెంట్ దాకా.. అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడుతుంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతులు బంద్ అయ్యాయి. విదేశాల నుంచి రావాల్సిన అనేక ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. స్టాక్‌మార్కెట్లు బేర్‌మంటున్నాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. ఈ రంగం..ఆ రంగం అంటూ ఏమీ లేదు. అన్ని రంగాలకు యుద్ధం షాక్ ఇచ్చింది. గడ్డు పరిస్థితులు మరింతకాలం కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముడి చమురు ధర పెరగడం వల్ల దేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఎగుమతులు బలహీన పడుతున్నందున కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. ఎరువులపై సబ్సిడీకి అధికంగా వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2025 డిసెంబరు నుంచి యూరియా ధర సుమారు 50 శాతం అధికమైంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు, ఎరువుల ద్రవ్యోల్బణం కారణంగా సబ్సిడీ 30వేల కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు అధికమైతే, దేశ వార్షిక కరెంట్ ఖాతా లోటు 15 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా. ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్‌కు 100 డాలర్ల దగ్గరగా ఉంటే, కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ కావచ్చు. కరెంట్ ఖాతా లోటు 70 బిలియన్ డాలర్ల మేర పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మున్ముందు ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలక ఎరువైన యూరియా సప్లైలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే యూరియాలో దాదాపు 46 శాతం ఒమన్ నుంచే వస్తుంటుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు కూడా మన దేశానికి యూరియాను విక్రయిస్తుంటాయి. ప్రస్తుతం ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు యూరియా సప్లై ఆగిపోయింది. యూరియాను తయారు చేయాలంటే సహజ వాయువు అవసరం. ఎల్‌ఎన్‌జీ సప్లై ఆగిపోవడంతో ప్రస్తుతం భారత్‌లోని యూరియా తయారీ ప్లాంట్లు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో యూరియా ధరలు ఇప్పటికే 19 నుంచి 28 శాతం పెరిగాయి. ఇతరత్రా ఎరువుల కొరత కూడా నెలకొంది.
యుద్ధ జ్వాలలు దేశంలో నిర్మాణ రంగాన్ని కూడా తాకాయి. పేద, మధ్య తరగతి జీవితాలపై యుద్ధం పెను ప్రభావం చూపుతోంది. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇనుము, సిమెంట్, ఇతర ముడి సరకుల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో చాలా వరకు నిర్మాణాలు నిలిచి పోతున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా కొన్ని పరిశ్రమలు మూసి వేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులకే ఇండియా కేరాఫ్ అడ్రస్. యుద్దం సప్లై చైన్‌ను ప్రభావితం చేస్తోంది. యూఏఈ మీదుగా మెడిసిన్స్, ఫార్మా ఉత్పత్తుల సరఫరా అవుతాయి. భారత ఫార్మా రంగానికి అక్కడి విమానాశ్రయం కీలకమైనది. ప్రపంచంలో జనరిక్ మెడిసిన్స్‌ను భారత్ అధికంగా సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో 60శాతం భారత్ నుంచి వస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ చెబుతోంది. భారత ఫార్మా ఎగుమతులలో అధిక భాగం దుబాయి ఓడరేవు ద్వారా జరుగుతాయి. ఇక్కడ నుంచి మందులు పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడుల వల్ల దుబాయి పోర్టు, ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధ జ్వాలలు పరిసర దేశాల్ని ప్రత్యక్షంగా.. దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన దేశాల్ని పరోక్షంగా కాల్చేస్తున్నాయి. ఇక్కడే భారత్ ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. దేశీయ చమురు అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారం. యుద్ధానికి ముందు వరకు భారత్‌కు వచ్చే చమురు సరఫరాలో 40 నుంచి 50 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే సాగేది. ఇప్పుడా జీవ నాడి బిగుసుకుపోయి, ఇక్కడ అనేక రంగాలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇంధన, ఏవియేషన్ రంగం ఆ కష్టనష్టాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ముడిచమురు మంటతో విమానయాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ఎరువుల కొరతతో సాగు ఖర్చులు పెరిగి ఆహార భద్రతపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది.
అంతిమంగా యుద్ధంతో దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు, మానసిక వేదనకు గురవుతారు. యుద్ధం వల్ల తరతరాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, అమెరికా-ఇరాన్ వార్ అయినా.. మానవాళికి ముప్పునే తెచ్చిపెట్టాయి. ఈ యుద్దాలతో ప్రపంచానికి ఒరిగిందేమీ లేదు. ప్రాంతీయ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి, ఇది చమురు, గ్యాస్, ఆహారం ఇలా అనేక రకాల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. యుద్ధం ఎందుకు జరిగినా.. ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా.. మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. గడచిన యుద్ధాలు చేసిన గాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యా పౌరుషాలతో పిచ్చిపట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండశాసనాలు చలామణీ కావడం వారికి పైశాచిక ఆనందం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు. మొత్తం ప్రపంచానికి కొరవిగా మారింది. అగ్రరాజ్యం అమెరికా అహంకారం, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెంపరితనం.. ప్రపంచానికి తలనొప్పులు తెచ్చింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం , ప్రాంతీయ అధిపత్యం అనే సమస్యను యుద్ధం ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, అమెరికా తన సైనిక శక్తిని , అంతర్జాతీయ ప్రతిష్ఠను భారీగా కోల్పోయే పరిస్థితికి దారి తీసింది.
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతోంది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్ డాలర్లను అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ధం కోసం మరో 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పెంటగాన్ వైట్‌హౌస్‌ని కోరింది. ఆయుధ నిల్వలు కరిగిపోయాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్‌లోని అమెరికా బేస్‌లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారింది. ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్‌పై యుద్ధంలో వినియోగించింది. 40 రోజుల పాటు జరిగిన యుద్దంలో అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామగ్రి నిల్వలు కరిగిపోయాయి. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోని ట్రంప్ ఆచరణ సాధ్యం కాని షరతులతో ఇరాన్ చర్చలకు కూడా రాలేని స్థితిని కల్పిస్తున్నారు. ప్రస్తుత స్థితిగతులు చూస్తుంటే.. ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా ట్రంప్ శాంతించేలా కనిపించడం లేదు. పైగా ఇదంతా ప్రపంచ శాంతి కోసమే చేస్తున్నామని, ఇరాన్ చేయబోయే నష్ట నివారణ కోసం.. ప్రపంచం ఈ మాత్రం నష్టం భరించడం సబబే అని అమెరికా రక్షణ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. అమెరికా నేతల మెదడు పనిచేస్తుందా.. లేదా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి.
యుద్ధం ప్రారంభమైన అనతికాలంలోనే అమెరికా అసాధారణమైన నష్టాలను చవి చూసింది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల ధాటికి అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, కీలకమైన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్గతంగా ప్రజల ఆగ్రహానికి దారి తీసింది. అమెరికాపై ఈ ప్రభావం రాను రాను మరింత తీవ్రంగా ఉండబోతోంది. అటు యుద్ధ ఖర్చులు, ఇటు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం అంటేనే వినాశనం అని చరిత్ర చెబుతున్నా, అగ్రరాజ్యాలు అదే బాటలో పయనించడం విషాదకరం. క్షిపణులు, బాంబులతో సమస్యలు పరిష్కారం కావని, అవి మరిన్ని సమస్యలకు బీజం వేస్తాయని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అనేక యుద్దాలతో ఇప్పటికే రుజువైంది. అమెరికా, ఇజ్రాయెల్ తమ మొండివైఖరిని వీడకపోయినా, లేదా ఇరాన్ తన విధ్వంసక దాడులను ఆపకపోయినా.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉంది. ఇక్కడి నుండి శాంతి వైపు అడుగులు వేయకపోతే ప్రపంచం వినాశనమే.
ఇప్పటికే యూరప్ సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఎక్కడో యుద్ధం జరిగితే, ఇక్కడ మనకు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. విమానయాన రంగం కుదేలైపోయింది. చివరికి మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. ఫైనల్ గా యుద్ధం ఏం సాధించిందంటే సమాధానం దొరకదు. అసలే ఏఐ జోరుతో కిందమీద పడుతున్న ఐటీ ఇండస్ట్రీ, యుద్ధం దెబ్బకు మరింతగా కుదేలైపోయింది. నిరుద్యోగం నానాటికి పెరిగిపోతుంది. ఇంతచేసి యుద్ధం ఏం సాధించిందంటే శూన్యం. ఇంకొన్నాళ్లు యుద్ధం చేసినా ఇదమిత్థంగా ఇది సాధిస్తామని అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ గానీ నమ్మకంగా చెప్పలేకపోతున్నాయి. కానీ యుద్ధం కొనసాగింపుకు ఉవ్విళ్లూరుతూ.. మొత్తం ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
తాజావార్తలు
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!