Wipro: ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఈ ఏడాది వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విప్రో ఖండించింది. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విప్రో స్పష్టం చేసింది. తాము తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అనుకున్న ప్రకారమే తమ ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తామని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును నిలిపివేసే ఎటువంటి నిర్ణయాన్ని తాము తీసుకోవడం లేదని.. అలాగే ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ వెనుకడుగు వేయడం లేదని విప్రో వివరణ ఇచ్చింది.
Read Also: Adani Group : శ్రీలంకలో అదానీ గ్రూప్.. ఇంధన ప్రాజెక్టులకు ఆమోదం
సంస్థ లాభాల ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఓసారి విప్రో సంస్థ తన ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లిస్తుంటుంది. అయితే ఈ త్రైమాసికంలో వేరియబుల్ పే ఎంత మొత్తంలో ఇస్తామన్న సంగతిని మాత్రం విప్రో వెల్లడించలేదు. మరోవైపు జూలై నుంచి ప్రమోషన్లు అమల్లోకి వస్తున్నాయని.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మిడ్ మేనేజ్ మెంట్ ఉన్నత స్థాయి ఉద్యోగులకు త్రైమాసికాల వారీగా కూడా ప్రమోషన్లు కల్పిస్తుందని విప్రో యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు పూర్తయ్యాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన విప్రో సంస్థ లాభాలు 18.8 శాతం నుంచి 15 శాతానికి తగ్గాయి. అటు ద్రవ్యోల్బణం ప్రభావం కూడా ఉండటంతో ఉద్యోగుల జీతాలపై పడుతుందని పలువురు భావించారు. ఈ నేపథ్యంలో విప్రో స్పందించి జీతాల పెంపు ఉంటుందని చెప్పడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.