కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డిజిటల్ కరెన్సీ గురించి ప్రధానంగా ప్రస్తావించింది. త్వరలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటన చేశారు. డిజిటల్ కరెన్సీని సీబీడీసీగా పిలుస్తారు. సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ రాకతో ఇప్పటివరకు నగదు వినియోగంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది.
వినియోగదారులు పేమెంట్లు చేయడానికి లేదా స్వీకరించడానికి ఒక మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వ్యాలెట్‌ను అందుబాటులోకి తెస్తారు. కానీ ఇది డబ్బుకు భిన్నంగా ఉండదు. ఉదాహరణకు డిజిటల్‌గా ఉన్న రూ.100.. ఫిజికల్‌గా ఉన్న రూ.100 లాగా ఉంటుంది. సీబీడీసీ అనేది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది కాగితం రూపంలో ఉండదు. సీబీడీసీని ఫిజికల్ కరెన్సీతో కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. డిజిటల్ కరెన్సీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల ఇతర ప్రాంతాల్లో నివసించే వారు తమ కుటుంబ సభ్యులకు సరక్షితంగా, సులభంగా, అదనపు ఖర్చులు లేకుండా డబ్బును బదిలీ చేయవచ్చు.
అయితే క్రిప్టో కరెన్సీకి డిజిటల్ కరెన్సీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. క్రిప్టో కరెన్సీ అనేది అధికారిక కరెన్సీ కాదు. ఈ కరెన్సీని ప్రైవేట్ కంపెనీలే సృష్టిస్తాయి. క్రిప్టో కరెన్సీకి తక్కువ అస్థిరత, ఎక్కువ భద్రత అవసరం. క్రిప్టోకరెన్సీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. 2022-23 నుంచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.