Warren Buffett: ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బర్క్‌షైర్ హాతవే సీఈఓ పదవికి బుధవారం (డిసెంబర్ 31) రాజీనామా చేశారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఒక చారిత్రక అధ్యాయం ముగిసింది. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న న్యూ ఇంగ్లాండ్ టెక్స్టైల్ కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద కాంగ్లోమరేట్‌లలో ఒకటిగా మార్చిన వ్యక్తిగా బఫెట్ చరిత్రలో నిలిచిపోయారు. బఫెట్ స్థానంలో గ్రెగ్ అబెల్ బర్క్‌షైర్ హాతవే బాధ్యతలు చేపట్టనున్నారు. “ఓరాకిల్ ఆఫ్ ఒమాహా”గా పేరొందిన బఫెట్ పోస్టును భర్తీ చేయడం సులభం కాదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 1962లో ఒక్కో షేరును కేవలం 7.60 డాలర్లకు కొనుగోలు చేయడం ప్రారంభించిన బఫెట్.. నేడు బర్క్‌షైర్ ఒక్కో షేరు ధర 7.5 లక్షల డాలర్ల వరకు తీసుకొచ్చారు. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్లలో ఒకరిగా ఆయనను చాలామంది అభివర్ణిస్తారు.
READ MORE: Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను మార్చిన లోక!
అంతేకాదు.. గత 20 ఏళ్లలో 60 బిలియన్ డాలర్లకు పైగా దానం చేసినప్పటికీ, బర్క్‌షైర్ షేర్ల రూపంలో బఫెట్ వ్యక్తిగత సంపద సుమారు 150 బిలియన్ డాలర్లుగా ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. బఫెట్ నాయకత్వంలో బర్క్‌షైర్ దశాబ్దాల పాటు ఎస్ అండ్ పీ 500 సూచీ కంటే మెరుగైన రాబడులను సాధించింది. ఈ ప్రయాణంలో ఆయన జికో, నేషనల్ ఇన్డెమ్నిటీ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇస్కార్ మెటల్‌వర్కింగ్ వంటి తయారీ సంస్థలు, డెయిరీ క్వీన్ వంటి రిటైల్ బ్రాండ్లు, పెద్ద యుటిలిటీ కంపెనీలు, అలాగే అమెరికాలో అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటైన బీఎన్‌ఎస్‌ఎఫ్‌ను కూడా బర్క్‌షైర్‌లో భాగం చేశారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కోకా-కోలా, ఆపిల్ వంటి కంపెనీలపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టడం ద్వారా బఫెట్ భారీ లాభాలు ఆర్జించారు. అయితే, సంస్థ పరిమాణం విపరీతంగా పెరగడంతో ఇటీవలి సంవత్సరాల్లో అదే స్థాయి వృద్ధిని కొనసాగించడం బర్క్‌షైర్‌కు కష్టంగా మారింది. కొత్తగా పెద్ద స్థాయి కొనుగోళ్లు చేయడం కూడా సవాలుగా మారింది. ఈ ఏడాది ఓక్సీకెమ్ కోసం చేసిన 9.7 బిలియన్ డాలర్ల కొనుగోలు కూడా సంస్థ లాభాల్లో గణనీయమైన మార్పు తీసుకురాదని విశ్లేషకులు అంటున్నారు.
READ MORE: India Billionaires: 2025 సంవత్సరంలో అత్యధికంగా సంపాదించిన ముఖేష్ అంబానీ.. టాప్-10లో ఎవరున్నారంటే?