ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. ఇది ఇంతకుముందు గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన వెంచర్ అదానీ గ్రీన్ ఎనర్జీ (AEGL), సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్ (ATGL) లో వాటాలను కైవసం చేసుకుంది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో టోటల్ ఎనర్జీస్ ప్రధాన వాటాదారు.
అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75 శాతం వాటాను కలిగి ఉంది. ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలోని భారతీయ సమ్మేళనాకి చెందిన సహజ వనరుల ద్వారా విద్యుత్తును తయారు చేసే విభాగం. ఏఈజీఎల్ (AEGL)తో కలిసి సౌర, పవన శక్తి నుంచి కరెంట్‌ను తయారు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలలో 50 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ టోటల్ గ్యాస్‌లో ఫ్రెంచ్ సంస్థ 37.4 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ (CNG) విక్రయిస్తుంది. వంట కోసం ఇళ్లకు పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేస్తుంది.
ఇప్పటికే పెట్టుబడులను నిషేధించిన కంపెనీ..
“అదానీపై వచ్చిన లంచం ఆరోపణలు .. మా కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. టోటల్ ఎనర్జీస్ ఇలాంటి అవినీతిని ప్రోత్సహించదు. ” అని ఫ్రెంచ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. జనవరి 2021లో, టోటల్ ఎనర్జీస్ లిస్టెడ్ కంపెనీ ఏఈజీఎల్ లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు అది 19.75 శాతం వాటాదారు. భారత్‌లో సహజ వనరుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని ప్రక్రియలో భాగంగా మూడు జాయింట్ వెంచర్లలో 50 శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది.
అదానీపై వచ్చిన ఆరోపణలు ఏంటి..
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా రెండు అంశాలకు సంబంధించినవి. 2 బిలియన్ డాలర్ల విలువైన రెండు సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం వీటిల్లో ఒకటి. ఇక అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా, ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించినది రెండో ఆరోపణ.