Tesla: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా భారత్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ ని వదిలేందుకు ఏ సంస్థ సిద్ధపడటం లేదు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీలు భారత బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టా కూడా భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చలు జరుపుతోంది. టెస్లా వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పెరుగుతుంది. దీంతో వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులు, సేవలు అందించే వీలు కలుగుతుంది.
Read Also: Rice Exports Ban: ప్రపంచదేశాలకు భారత్ షాక్.. బియ్యం ఎగుమతులపై నిషేధం.?
గతంలో చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మాలని ఎలాన్ మస్క్ భావించాడు. అయితే కేంద్రం మేకిన్ ఇండియా ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ దేశంలో తయారైతేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. దీని తర్వాత ప్రస్తుతం ఈ సమాచారం బయటకు వచ్చింది.
టెస్లా ఏడాదికి 5,00,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు పోటీ ఇవ్వాలంటే భారతీయులకు తక్కువ ధరతో, ఎక్కువ ఫీచర్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెస్లా తన కార్లను రూ. 20 లక్షల నుంచి అందించాలని అనుకుంటోంది. ఇది భారతదేశ ఈవీ మార్కెట్ లో పోటీని పెంచే అవకాశం ఉంది. చైనా మాదిరిగానే భారత దేశాన్ని తన ఎగుమతులకు స్థావరంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. స్థానికంగా టెస్లా కార్లను తయారు చేయడం ఇటు కంపెనీ, దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు ఈవీ బ్యాటరీలకు అవసరమయ్యే లిథియం నిల్వలు భారతదేశంలో భారీ ఎత్తున వెలుగులోకి రావడం కూడా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఊతం ఇవ్వనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు ఆటోమేకర్స్ భారత్ వస్తున్నాయి.