Telangana and Four other rich States: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా రిజిస్టరైన మొత్తం కార్లు మరియు SUVల్లో దాదాపు 38 శాతం తెలంగాణ సహా 5 సంపన్న రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 14 లక్షల కార్లు మరియు SUVలు రిజిస్టర్ కాగా అందులో 5 లక్షల 4 వేల వాహనాలు ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, గుజరాత్‌లలోనే నమోదయ్యాయి. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి 5 అత్యంత పేద రాష్ట్రాల్లో 18.9 శాతం మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.
ఆర్గానిక్ మిల్క్‌ను ప్రోత్సహించండి: ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆర్గానిక్ మిల్క్‌ను ప్రోత్సహించాలని, రాష్ట్రంలోని వెటర్నరీ హాస్పిటల్స్‌లో సర్వీసులను బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్గానిక్ మిల్క్ పైన రైతులకు అవగాహన కల్పించాలని, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. చిన్నారులకు పోషకాహారంలో భాగంగా పాలు, గుడ్లు ఇవ్వాలని, అయితే వాటిలో రసాయన అవశేషాలు లేకుండా చూడాలని సూచించారు. కెమికల్ రెసిడ్యూస్.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.
వృద్ధి అంచనా 3.2కి తగ్గింపు
ఈ ఏడాది తూర్పు ఆసియా మరియు పసిఫిక్ దేశాల వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంక్ 3.2 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందుతున్న ఈ రీజియన్ గ్రోత్ గతేడాదిలోని 7.2 శాతం నుంచి ఈ ఏడాదిలో నెమ్మదిస్తుందని అంచనా వేసింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ ప్రాంత వృద్ధి వచ్చే ఏడాది 4.6గా నమోదు కావొచ్చని పేర్కొంది. తూర్పు ఆసియా మరియు పసిఫిక్ దేశాలు ఈ ఏడాది 5 శాతం గ్రోత్ సాధిస్తాయని ఏప్రిల్ నెలలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే.. అది కాస్తా ఇప్పుడు 3.2 శాతానికి పడిపోవటం గమనించాల్సిన విషయం.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లలో కొద్ది రోజులుగా సానుకూల సంకేతాలు కరువయ్యాయి. దీంతో ఇవాళ మళ్లీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ అయి 56874 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 100 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ప్రస్తుతం 16906 వద్ద ఉంది. టొరెంట్ ఫార్మా, ఓఎన్‌జీసీ, రెడ్డీస్, బిర్లా, బీపీసీఎల్, బీహెచ్‌ఈఎల్ స్టాక్స్ బెటర్‌గా ఉన్నాయి. కొనుగోలు చేయాలనుకునేవాళ్లు పరిశీలించొచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.52 వద్ద కొనసాగుతోంది.