TCS: ఐటీ సంస్థలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యం భయాల కారణంగా, ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ పరిణామాలు ఇండియాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ప్రస్తుత పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిన్ తన ఉద్యోగులకు వేతన పెంపును వాయిదా వేసినట్లు అనధికార వార్తలు వినిపిస్తున్నాయి.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.
Read Also: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల పెంపు వాయిదా..!
ఇదిలా ఉంటే మరో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 200 మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. జాయినింగ్ లెటర్లు ఇచ్చి, సంస్థలోకి ఆహ్వానించింది, ఇప్పుడు ఆ ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల్ని 3 నెలల పాటు ప్రాజెక్టుల్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోందది. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, ఆర్థికమాంద్యం వస్తుందనే భయాలు, ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బెంగళూర్, పూణే, కొచ్చి, ఢిల్లీ, భువనేశ్వర్, ఇండోర్ కి చెందిన పలువురు ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీరందరికి 1.8 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్నవారే అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
మరోవైపు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నియమించుకున్న వారందరికీ ఇప్పటికే 2,3 సార్లు జాయినింగ్ డేట్స్ ఇచ్చి పోస్ట్‌పోన్ చేసింది. అక్టోబర్ వరకు జాయినింగ్ డేట్స్ ఇవ్వలేమని ఇటీవల అభ్యర్థులకు కంపెనీ మెయిల్స్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై టీసీఎస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.