Infosys: ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికమాంద్యం భయాలు, దీంతో పాటు కంపెనీల ఆదాయం తగ్గడం ఇలా పలు సమస్యలను ఎదుర్కొంటోంది ఐటీ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్ధేశ్యంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి. ఇప్పటికీ ఈ లేఆఫ్స్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఆన్ బోర్డింగ్ తేదీలను వాయిదా వేస్తూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మేనేజర్ స్థాయి కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులందరికీ జీతాల పెంపు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వేతన పెంపుకు అర్హత ఉన్న చాలా మంది ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికి(జూన్)లో సాధారణంగా సవరించి వచ్చే వేతనాలను పొందుతారు. అయితే ఈ సారి మాత్రం జీతాల పెంపు ఉండదని మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. జీతాల పెంపు ఎప్పుడు ఉండబోతోందనే విషయం తమకు తెలియదని ఉద్యోగులు చెబుతున్నారు.
Read Also: Internet Apocalypse: రెండేళ్లలో “సోలార్ మాగ్జిమమ్”కి సూర్యుడు.. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అవుతుందా..?
ఈ పరిణామాలు అన్ని ఐటీ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తున్నాయని నివేదిక పేర్కొంది. 2020 తర్వాత ఇన్ఫోసిస్ జీతాల పెంపును వాయిదాకు ఆర్థిక కారణాలే కారణం అని తెలుస్తోంది. గతంలో 2020లో కోవిడ్-19 వ్యాప్తి సమయలో కూడా కంపెనీ వేతన పెంపును వాయిదా వేసింది. అయితే ఈ తర్వాత ఏడాది పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత జీతాల పెంపును ప్రారంభించింది. ఇన్ఫోసిస్ తన మొదటి త్రైమాసిక ఫలితాలను జూలై 20న విడుదల చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 4 నుంచి 7 శాతం వరకు ఆదాయ వృద్ధిని సాధించింది. 2018 ఆర్థిక సంవత్సరం తర్వాత కంపెనీ ఆదాయం ఈ పరిధిలోకి పడిపోవడం ఇదే తొలిసారి.
2023 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో, ఇన్ఫోసిస్ సంస్థ అంతటా దాని వేరియబుల్ చెల్లింపును సుమారు 60 శాతం తగ్గించింది. అయితే, తుది వేరియబుల్ చెల్లింపు అనేది ఉద్యోగి యూనిట్ లేదా డిపార్ట్‌మెంట్ మరియు పే గ్రేడ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గత నెలలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ అట్రిషన్ రేట్లను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నాల గురించి ప్రస్తావించారు.