Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకుందన్న వార్త మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. శుక్రవారం జలసంధిని తెరిచారన్న వార్తతో నిఫ్టీ 400 పాయింట్లు లాభపడుతుందని ఆశించినా, శనివారం నాటి ‘క్లోజర్’ వార్త సీన్ రివర్స్ చేసింది.
READ ALSO: Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
భారీ ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిసినప్పటికీ, ఇన్వెస్టర్ల సంపద మాత్రం హరించుకుపోయింది. ఈ రోజు మార్కెట్లో సెన్సెక్స్ 26.7 పాయింట్లు (0.03%) పెరిగి 78,520.30 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే 11.30 పాయింట్లు (0.05%) పెరిగి 24,364.85 వద్ద స్థిరపడింది. ఈ మార్కెట్లో ఐటీ, రియల్టీ రంగాలు రాణించగా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. టాటా ట్రెంట్ 3% లాభపడగా, ఎల్&టి 1% నష్టపోయింది.
పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా నిలిచిపోతుందన్న భయంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $95-$98 కి చేరింది. భారతీయ వోలటాలిటీ ఇండెక్స్ (VIX) 10% పెరగడం మార్కెట్లో ఉన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. చమురు ధరలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గించేలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ పూర్తిగా ఇరాన్-అమెరికా చర్చలు, హోర్ముజ్ జలసంధి స్థితిగతులపైనే ఆధారపడి ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పటికే 350 పాయింట్లకు పైగా పతనాన్ని సూచిస్తుండటం ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఉద్రిక్తతలు కొనసాగితే రాబోయే రోజుల్లో మార్కెట్ మరింతగా పతనం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!
