Lenskart controversy: ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ ‘లెన్స్‌కార్ట్’ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి చెందిన ఒక పాత డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అది కాస్తా పెద్ద దుమారానికి దారితీసింది. దీని ప్రభావం కంపెనీ వ్యాపారంపైనే కాకుండా స్టాక్ మార్కెట్ విలువపై కూడా తీవ్రంగా పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.4,500 కోట్లకు పైగా పడిపోవడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటే..
READ ALSO: Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
వివాదానికి కారణం ఇదే..
లెన్స్‌కార్ట్ సంస్థకు చెందిన ఒక పాత అంతర్గత ‘స్టైల్ గైడ్’ పత్రం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఇందులో ఉద్యోగులు పని వేళల్లో బొట్టు (బిందీ), తిలకం వంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదని నిబంధన ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. #BoycottLenskart అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు, కంపెనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం సెగ స్టాక్ మార్కెట్‌కు తాకింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సోమవారం లెన్స్‌కార్ట్ షేర్లు దాదాపు 5 శాతం మేర క్షీణించి రూ.508.70 కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత వారం రూ.92,872.20 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ, సోమవారం ఒకానొక దశలో రూ.88,331.48 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ సమయంలో సుమారు రూ.4,540.72 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని రూ.530.60 వద్దకు చేరింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,038.73 కోట్ల వద్ద స్థిరపడింది.
సారీ చెప్పిన పీయూష్ బన్సల్ ..
వివాదం ముదురుతుండటంతో లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. వైరల్ అవుతున్న పత్రం చాలా పాతదని, అది కంపెనీ ప్రస్తుత విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. “మా కంపెనీలో బొట్టు, తిలకాలతో సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలపై నిషేధం లేదు. జరిగిన అపార్థానికి, ఆందోళనకు నేను క్షమాపణలు కోరుతున్నాను” అని బన్సల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వివాదానికి ముగింపు పలకడానికి లెన్స్‌కార్ట్ అధికారికంగా కొత్త ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’ను రిలీజ్ చేసింది. ఆ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఉద్యోగులు బిందీలు, తిలకాలు, సింధూరం, కలావాలు (చేతి మొలతాడు), మంగళసూత్రాలు ధరించవచ్చు. అలాగే కడాలు, హిజాబ్‌లు, తలపాగాలను (Turbans) కూడా కంపెనీ నిస్సందేహంగా అనుమతిస్తుంది. తమ బృంద సభ్యుల మతపరమైన మనోభావాలను తాము గౌరవిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఒక చిన్న పొరపాటు కార్పొరేట్ సంస్థల మార్కెట్ విలువను ఎలా ప్రభావితం చేస్తుందో లెన్స్‌కార్ట్ ఉదంతం మరోసారి నిరూపించింది. పీయూష్ బన్సల్ త్వరితగతిన స్పందించి క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
READ ALSO: MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్‌మ్యాన్!
