దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వ సంస్థ రాస్‌నెఫ్ట్‌తో చర్చలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇదివరకు చేసుకున్న ఒప్పందాలకు ఇవి అదనంగా జరగనున్నాయని, ధరతో పాటు ఎంత పరిమాణం అనే అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్టు సంబంధిత వర్గాలు వివరించాయి.
తాజా ఒప్పందాలు ఖరారైతే, ఇప్పటికే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుకు అదనం అవుతుంది. దిగుమతుల పరిమాణం, ధరలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సరఫరాలు అన్నింటికీ ఆర్థికసాయం చేసే భారత బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించాక, రష్యా చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిణామాన్ని భారత్ అనుకూలంగా మలచుకుని, రష్యా నుంచి చౌకగా ముడిచమురును కొనుగోలు చేస్తోంది. తాజాగా రాస్‌నెఫ్ట్ లాంటి రష్యా కంపెనీల నుంచి నేరుగా చమురును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ రిఫైనరీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయర ఎనర్జీ కూడా ఆసక్తిగా ఉన్నాయని సమాచారం.
RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..
భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మొదటి వారం నాటికి రష్యా నుంచి 4 కోట్ల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇది 2021 ఏడాది మొత్తానికి దిగుమతైన దాంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. మే నెలలో రోజుకు 7.40 లక్షల బ్యారెళ్లు, ఏప్రిల్‌లో 2.84 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. అయితే, రష్యా నుంచి దిగుమతులను తగ్గించాలని అమెరికాతో పాటు యూరప్ దేశాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చాయి. యూరప్ కొనుగోళ్లతో పోలిస్తే భారత్ దిగుమతులు తక్కువేనని కేంద్రం సమర్థవంతమైన జవాబును ఇస్తోంది.