Gold And Silver Rate: గత కొంతకాలంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిన బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు ( జనవరి 31న) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఒక్కరోజులోనే తులం బంగారం ధర రూ.19,750 మేర తగ్గి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,653గా కొనసాగుతోంది. ఒక్కరోజే దాదాపు 10 శాతం మేర బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి రోజులుగా బంగారం ధరలు ఎగబాకిన నేపథ్యంలో ఈ స్థాయి పతనం కావడం మార్కెట్‌లో కలకలం రేపుతుంది.
Read Also: Union Budget 2026: బడ్జెట్‌లో ఈసారి ఉద్యోగాల వరద.. కోటి ఉద్యోగాలే టార్గెట్..?
మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ.1,07,971 మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,91,922గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సుమారు 34 శాతం మేర క్షీణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లపై అంచనాలు మారడంతో.. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలే ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరింత ఒడిదుడుకులు కొనసాగే ఛాన్స్ ఉంది.