ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. మనిషికి మూడు ప్యాకెట్లు మాత్రమే ఇస్తామని చెప్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. తమకు నెలలో మూడు ప్యాకెట్లు ఎలా సరిపోతాయని వాళ్లు డీమార్ట్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితులే చాలా చోట్ల ఉన్నాయని సమాచారం అందుతోంది.
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వంటనూనెలను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాడు అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తాజా ఉదంతంతో నిరంతరం దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇంఛార్జి ఎస్పీ ఈశ్వర్‌రెడ్డి వెల్లడించారు. అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.