NTV Telugu Site icon

USA: అదే జరిగితే.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తప్పదు?.. యూఎస్‌ కాంగ్రెస్ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

Suhas Subramanyam

Suhas Subramanyam

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్‌ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్‌ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా.. భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌పై టారిఫ్‌లు విధిస్తే అది వాణిజ్య యుద్ధానికి దారితీయొచ్చని ఆయన పేర్కొన్నారు.

నేను మద్దతు ఇవ్వను: సుబ్రహ్మణ్యం
‘‘టారీఫ్‌లు విధించడానికి నేను మద్దతు ఇవ్వను. అది నిజంగా చెడు చేస్తుందని నమ్ముతాను. వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చు. ఇది ఏ దేశానికీ ప్రయోజనకరం కాదని నమ్ముతున్నాను. భారత్‌లో చాలా కంపెనీలు బాగా పని చేస్తున్నాయి. వాటిల్లో చాలా అమెరికాలో కూడా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి మరింత పనిచేయాలి. అప్పుడే బలపడతాం. భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈనేపథ్యంలో అమెరికా-భారత్‌ సంబంధాలు బలపడటం ఇరుపక్షాలకు చాలా కీలకం’’ అని పీటీఐతో సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

టారిఫ్ పెంచితే భారత్ జీడీపీలో మార్పులు..
గతంలో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే, భారత జీడీపీ 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. భారత్, అమెరికా మధ్యలో 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే, భారత్ బాగా నష్టపోతుంది.

అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానం..
కాగా.. ట్రంప్ గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. భారత్, చైనా సహా చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అలాగే అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలరు. భారత్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది.

Show comments