భారీగా తగ్గిన డీమ్యాట్ ఖాతాలు
డీమ్యాట్ ఖాతాలు భారీగా తగ్గుతున్నాయి. జూన్‌లో కొత్తగా 17 పాయింట్ 9 లక్షల అకౌంట్లను మాత్రమే తెరిచారు. 2021 ఫిబ్రవరితో పోల్చితే ఇదే తక్కువ సంఖ్య అని చెబుతున్నారు. దీంతో ఈక్విటీలు 13 నెలల కనిష్టానికి పడిపోతున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పాతిక శాతం తగ్గాయి.
79.44కి పడిపోయిన రూపాయి
రూపాయి మారకం విలువ తాజాగా మరోసారి తగ్గింది. నిన్న సోమవారం 79 పాయింట్ నాలుగు నాలుగు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు.. అమెరికా డాలర్ వ్యాల్యూ 20 ఏళ్ల గరిష్టానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా బలహీన ఆర్థిక వృద్ధితోపాటు యూరప్‌లో చమురు సంక్షోభ ప్రభావం రూపాయిపై పడింది.
విదేశీ రుణాలపై ఆందోళన వద్దు
విదేశీ రుణాలపై నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. 6 వందల 20 పాయింట్ 7 బిలియన్ డాలర్లలో తమ వాటా 130 పాయింట్ 8 బిలియన్ డాలర్లని స్పష్టం చేసింది. మొత్తం రుణంలో ఇది కేవలం 21 శాతం మాత్రమేనని వెల్లడించింది. అమెరికా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్‌లతో పోల్చితే భారత ప్రభుత్వ స్థూల రుణం చాలా తక్కువని వివరించింది.
అంతర్జాతీయ చెల్లింపులు ఇక రూపాయల్లో
అంతర్జాతీయ దిగుమతులు, ఎగుమతుల లావాదేవీలను ఇకపై రూపాయల్లో జరిపేందుకు ఆర్బీఐ అనుమతించింది. దీనివల్ల రష్యాతోపాటు ఇతర దేశాలతో ద్వైపాక్షిక వ్యాపారం మరింత సులభతరం కానుంది. విదేశాలతో ప్రామాణిక కరెన్సీనే ఇచ్చిపుచ్చుకోవాల్సిన పని ఉండదు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఇప్పటికే పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న సమయంలో ఇండియా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం చెప్పుకోదగ్గ విషయమే.
చమురు అమ్మకాలు పెరుగుతున్నా నష్టాలే
కరోనాకి ముందు, తర్వాత ఉన్న పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వినియోగం ఊపందుకుంది. జూన్‌లో 5 పాయింట్ 6 శాతం సేల్స్ పెరిగాయి. గతేడాది కనిష్ట స్థాయి కన్నా ఈ ఏడాది 18 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయి. అయినా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తొలి త్రైమాసికంలో భారీ నష్టాలనే నమోదు చేసే అవకాశాలున్నాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఉమ్మడిగా 10 వేల 7 వందల కోట్ల రూపాయలను కోల్పోతాయని అంటున్నారు. తక్కువ రేటుకే ఇంధనాన్ని అమ్మటం వల్ల వీటికి ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 16150 పాయింట్ల వద్ద తీవ్ర ఒత్తడి ఎదుర్కొంటోంది. మెటల్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నా డిమాండ్ లేక వెలవెలబోతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ)లో స్మాల్, మిడ్ క్యాప్‌లకు 0.2 శాతం ప్రాఫిట్ వచ్చింది. సూక్ష్మ రుణ సంస్థ స్పందన స్ఫూర్తి నికర లాభం 42 శాతం తగ్గిన తర్వాత షేర్ల విలువ 5 శాతం పడిపోవటం గమనార్హం.