దేశంలో మొబైల్ వాడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తమకు నచ్చిన, అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ను మొబైల్ యూజర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే మార్కెట్‌లో బాగా పోటీపడుతున్న జియో, ఎయిర్‌టెల్‌కు తోడుగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా పలు ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.100 కన్నా తక్కువగా ఉండే మూడు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
రూ.87 ప్లాన్:
బీఎస్ఎన్ఎల్ తెచ్చిన రూ.100లోపు ప్లాన్‌లలో ఇది తక్కువ. ఎంతోమంది యూజర్లకు ఈ ప్లాన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా, 100 SMSలు పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్‌లో డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ 40kbps స్పీడుతో వస్తుంది. ఈ ప్లాన్ లోకల్, ఎస్టీడీ కాలింగ్ సర్వీస్ రెండింటిలోనూ ఉంది.
రూ.97 ప్లాన్:
బీఎస్ఎన్ఎల్ కంపెనీ డేటాను ఎక్కువగా వాడే వారిని ఉద్దేశించి ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో కూడా అపరిమిత కాల్ చేసుకునే అవకాశం, రోజుకు 100 SMSలు వస్తాయి. ఇక నిర్దిష్ట డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి పడిపోతుంది.
రూ.99 ప్లాన్:
బేసిక్ ఫోన్లు వాడే వారి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. డేటాతో పెద్దగా పని లేని యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో అద్భుతంగా పనికి వస్తుందని చెప్పుకోవాలి. ఈ ప్లాన్ ద్వారా 22 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. అయితే డేటా, SMSల సదుపాయం మాత్రం లేదు.