American Express Credit Cards: కొత్త క్రెడిట్ కార్డులను జారీచేయకుండా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌పై విధించిన నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తివేసింది. లోకల్ డేటా స్టోరేజ్ రూల్స్ పాటించట్లేదనే కారణంతో 2021 ఏప్రిల్‌లో నిషేధం విధించిన ఆర్బీఐ 15 నెలల అనంతరం నిన్న అనుమతించింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసి తాజా నిర్ణయం తీసుకుంది.
ఓఎన్‌జీసీ మళ్లీ..
కృష్ణా-గోదావరి బేసిన్‌లో లభించే గ్యాస్‌ను విక్రయించేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మళ్లీ టెండర్ జారీ చేసింది. ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ కనీస ధరను 15 డాలర్లుగా నిర్ణయించింది. ఏప్రిల్‌లో విడుదల చేసిన టెండర్‌లో పేర్కొన్న రేటు కన్నా ఇది 5 డాలర్లకు పైగానే ఎక్కువ కావటం గమనించాల్సిన విషయం. గ్లోబల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఓఎన్‌జీసీ ఈ సవరణ చేసింది.
DRDO Entry Test: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐవారికి 1901 ప్రభుత్వ ఉద్యోగాలు. డీఆర్‌డీఓ ఎంట్రీ టెస్ట్.
కోలుకున్న హోటళ్లు
మన దేశంలో హోటల్ రంగం కొవిడ్ పూర్వ స్థితికి కోలుకుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఆరు నెలల్లోపే ఇన్వెస్టర్లకు 50 శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, ముంబై వంటి ఆరు ప్రధాన నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో హోటల్స్‌కి ఏకంగా 244 శాతం డిమాండ్ పెరగట విశేషం. వివాహాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వెకేషన్స్‌తో హోటళ్లు కళకళలాడుతున్నాయి.
2 ఏళ్లలో 90 లక్షలు
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ గ్రాసరీ బిజినెస్ అయిన ఇన్‌స్టామార్ట్.. ప్రారంభమైన రెండేళ్ల వ్యవధిలోనే వినియోగదారుల మన్ననలు పొందింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 90 లక్షల మంది కస్టమర్లు ఈ సేవలను పొందారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల సంఖ్య 16 రెట్లు పెరగటం చెప్పుకోదగ్గ విషయం. ఈ ప్లాట్‌ఫామ్ 500లకు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది.
ఆన్సర్ షీట్లకు నో
కర్ణాటకలోని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ జారీచేసిన ఉత్తర్వులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. స్కూల్ బోర్డ్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రింటింగ్ చేసే స్టేషనరీలోని కొన్ని ఐటమ్స్‌కే జీఎస్టీ వర్తిస్తుందని చెప్పటం చర్చనీయాంశంగా మారింది. క్వచ్చన్ పేపర్లు, అడ్మిట్ కార్డులు, పాస్ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులు.. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావన్న అధికారులు ఆన్సర్ బుక్‌లెట్ల ముద్రణకు మాత్రం జీఎస్టీ అప్లై అవుతుందని తెలిపారు.
తగ్గిన దిగుమతులు
జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మన దేశానికి అమెరికా నుంచి మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతులు తగ్గాయి. అదే సమయంలో రష్యా నుంచి భారీ స్థాయిలో పెరిగాయి. ఇండియా దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం మాత్రమే కాగా అది ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో అనూహ్యంగా 12.9 శాతానికి పెరిగింది.