‘Aha’ Decision: తెలుగు, తమిళ కంటెంట్ ప్రొవైడర్ అయిన ‘ఆహా’ ఓటీటీ.. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. చిన్న పట్టణాల నుంచి కూడా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంతోపాటు యాడ్స్‌తో కూడిన వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైబ్రిడ్ మోడల్‌కి మారుతోంది. యాడ్స్‌లేని సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కూడా తమ ప్లాట్‌ఫామ్‌పై ఉందని స్పష్టం చేసింది. దేశంలోని మెజారిటీ ఓటీటీలు సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూ పైనే ఆధారపడుతుండటంతో లాభాలు ఆర్జించలేకపోతున్నాయి. ఫలితంగా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఈ బాటపడితే దాన్ని ఇప్పుడు ‘ఆహా’ అనుసరిస్తోంది.
అదానీ కొత్త డీల్
మన దేశంలోని అతిపెద్ద ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపోల్లో ఒకటైన ICD తంబ్‌ని అదానీ లాజిస్టిక్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 835 కోట్ల రూపాయలు. గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతంలో ఉన్న ఈ డిపో ఇప్పటివరకు నవ్‌కార్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది. ఈ కొనుగోలుకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఒక్క తైవాన్‌లోనే..
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో ఉపయోగించే అన్ని రకాల చిప్‌ల్లో దాదాపు 75 శాతం ఒక్క తైవాన్‌లోనే తయారవుతున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ అసోసియేషన్.. దేశీయ, అంతర్జాతీయ మొబైల్ డివైజ్‌ల తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అత్యాధునిక లాజిక్ చిప్‌ల రూపకల్పనలో తైవాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఫ్యూచర్.. పూర్
బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్ రేట్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. తాజాగా ఒక బ్యారెల్ ధర 92 పాయింట్ ఎనిమిదీ మూడు డాలర్లకు దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ తర్వాత ఇంత తక్కువ రేటు నమోదుకావటం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ భయాలు నెలకొన్నాయి. అందువల్లే చమురు ధరలు పతనమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా.. జాబ్‌లెస్
కొవిడ్ కారణంగా చైనా యువతలో రికార్డ్ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 19 పాయింట్ 9 శాతం జాబ్‌లెస్ రేట్ నెలకొన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య తొలిసారిగా ఈ ఏడాది కోటి మార్క్ దాటనుంది. ఈ సంఖ్య గతేడాది కన్నా 16 లక్షలకు పైగా పెరుగుతోంది.
ఫ్రీ రేషన్ కొనసాగేనా?
కరోనా నేపథ్యంలో నిరుపేదల కోసం ప్రారంభించిన ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ పథకం సెప్టెంబర్ తర్వాత కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనికి వివిధ కారణాలు దారితీస్తున్నాయి. గోధుమల దిగుమతి భారీగా తగ్గిపోవటం, ప్రధానంగా వరి పంటను సాగు చేసే రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనటం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఎన్నికలు తదితర అంశాలు దీనిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.