“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైతం ఎక్కడా కన్పించట్లేదు. తాజా సీజన్ ఇంకా పూర్తి కాకముందే కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు రావడం చూస్తుంటే ఈ నెగెటివ్ టాక్ కు బ్రేక్ పడేలా కన్పిస్తోంది.
Read Also :
‘బిగ్ బాస్’ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కు కొత్త అవకాశాలను అందించడంలో ఈ షో సహాయపడుతుందని అంటారు. కష్టాల్లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు తమ కెరీర్‌లో ఎదగడానికి బిగ్ బాస్ వేదికపై కొత్త ఇమేజ్‌ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ టీవీ షో ఐదవ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు క్రేజీ ఆఫర్‌లను కొట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో భాగంగా ‘బిగ్ బాస్’ వేదికపై హోస్ట్ నాగార్జునతో కంటెస్టెంట్ లోబో తాను మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్నట్లు వెల్లడించాడు. “భోళా శంకర్”లో ఆయనతో నటించే అవకాశం చిరంజీవి కల్పించారని లోబో వెల్లడించాడు. హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే లోబో చిరంజీవిని కలిశాడు. షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే.
Read Also :
మరోవైపు అనారోగ్యంతో మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిన మోడల్ జెస్సి సైతం క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో జెస్సీకి లీడ్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని వెల్లడించాడు. “ఇంటి నుండి బయటకి వచ్చిన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నేను కథానాయకుడిగా నటించే చిత్రం కోసం నన్ను సంప్రదించారు” అని జెస్సీ నాగార్జునతో అన్నారు. ఇక శ్వేతా వర్మ, ప్రియాంక సింగ్, ఇతరులు తమకు కూడా ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించారు.