బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి కాలపరిమితి 11వ రోజుతో పూర్తయ్యింది. ఆమె తర్వాత కెప్టెన్ గా విశ్వ ఎంపిక కావడం విశేషం. ‘పంతం నీదా నాదా’ గేమ్ థర్డ్ ఫేజ్ లో ‘అగ్గిపుల్లా మజాకా’ అనే ఆటను బిగ్ బాస్ ఈగల్, ఊల్ఫ్ టీమ్స్ తో ఆడించాడు. అందులో ఈగల్ టీమ్ విజయం సాధించింది. గత మూడు రోజులుగా జరిగిన పోటీల ద్వారా ఈగల్ టీమ్ కు 6, ఊల్ఫ్ టీమ్ కు 5 ఫ్లాగ్స్ దక్కాయి. దాంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను బిగ్ బాస్ ఈగల్ టీమ్ సభ్యులకు ఇచ్చాడు. దానికి ముందు రోజు రాత్రి శ్వేత వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆర్జే కాజల్ చేసిన కేక్ ను కట్ చేసింది. ఆమె తండ్రి పంపిన బర్త్ డే విషెస్ వీడియోను బిగ్ బాస్ హౌస్ లోని టీవీ మానిటర్ లో ప్లే చేశారు. ఇక ఈగల్ టీమ్ కెప్టెన్ అయిన శ్రీరామచంద్ర… తన టీమ్ సభ్యులను సంప్రదించి, అందులోంచి యానీ, విశ్వ, హమీదా, ప్రియాంక లను కెప్టెన్ టాస్క్ కు ఎంపిక చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోని గార్డెన్ ఏరియాలో కొన్ని కొబ్బరి కాయలు పెట్టి, ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ అనే ఆట ఆడించాడు బిగ్ బాస్. ఈ నలుగురూ ఇతర హౌస్ మేట్స్ సాయంతో తమ ముందున్న బీకర్ ను కొబ్బరి నీళ్ళతో నింపాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో విశ్వ విజేతగా నిలవడంతో అతన్నే రెండోవారం కెప్టెన్ గా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. నిజానికి ఇందులో విశ్వ చేసిన పనికంటే… అతను ఎంచుకున్న టీమ్ చేసిన పని వల్లే కెప్టెన్ అయ్యాడు. ముందు మూడు రోజులు గేమ్ లో భాగంగా తీవ్రంగా గొడవలు పడిన బిగ్ బాస్ హౌస్ మేట్స్… 11 రోజు మాత్రం ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించేశారు. మానస్, లహరి మధ్య; లోబో, ఉమ మధ్య సరికొత్త ప్రేమ ఈ 11వ రోజున చిగురించింది. అలానే షణ్ముఖ్… హమీదాతో కాస్తంత అభిమానంగా మాట్లాడుతూ ఉండేసరికీ… రవి, లహరి తదితరులు అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనను ఉద్దేశించి ‘దీప్తి… షణ్ముఖ్ మీద ఓ కన్నేసి ఉంచూ’ అంటూ సరదాగా హెచ్చరించారు.
ఉమకు బెడ్ దానం చేసిన లోబో!
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన రోజున బెడ్ లేక ఇబ్బంది పడిన లోబో అండ్ ఉమకు ఈ వారం సింగిల్ కాట్ బెడ్ ను కేటాయించాలని బిగ్ బాస్ భావించాడు. అయితే… ఇద్దరూ చెరొక స్కిట్ చేసి.. ఎవరు విజేతగా నిలిస్తే వారికే సింగిల్ కాట్ బెడ్ దొరుకుతుందని చెప్పాడు. లోబో… ప్రియాంకతో కలిసి ఆటో డ్రైవర్, కస్టమర్ స్కిట్ చేయగా; ఉమ, సిరితో కలిసి అత్త కోడళ్ళు భ్రమ, వాస్తవం అనే అంశంపై స్కిట్ చేసింది. ఇందులో లోబోను హౌస్ మేట్స్ విజేతగా ప్రకటించారు. దాంతో అతను సింగిల్ బెడ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ముందు నుండి చెబుతున్నట్టుగా లోబో దాన్ని ఉమాదేవికి ఇచ్చేశాడు. పదకొండవ రోజంతా… ఉమ, లోబో ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం… చూస్తుంటే కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంది.
ఇదిలా ఉంటే… సెప్టెంబర్ 16 బర్త్ డే సందర్భంగా షణ్ముఖ్… బిగ్ బాస్ హౌస్ మేట్స్ సమక్షంలో కేక్ కట్ చేశాడు. అతని తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు దీప్తి సునయన సైతం షణ్ముఖ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. అంతే కాదు…. బిగ్ బాస్ హౌస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకిఎక్కి, అక్కడ కేక్ కట్ చేసి, గట్టిగా అరుస్తూ బిగ్ బాస్ హౌస్ లోని వారికి వినిపించేలా… బర్త్ డే విషెస్ తెలిపి, బాణ సంచా కాల్చారు. సో… గురువారం బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులు అటు శ్వేత వర్మ, ఇటు షణ్ముఖ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేశారు.