ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని చెప్పాడు. అయితే… అందులో ఒకరిని ఫైనల్ చేయడానికి మరో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.
గార్డెన్ ఏరియాలో నాలుగు సైకిళ్ళను పెట్టి… నాన్ స్టాప్ గా తొక్కుతూ, లైట్ ఆగకుండా ఎవరు తొక్కుతారో వేరే కెప్టెన్ అని బిగ్ బాస్ తేల్చి చెప్పాడు. ఈ టాస్క్ ప్రియా నేతృత్వంలో జరిగింది. తమకు నచ్చిన వాళ్ళు విన్ అయ్యేలా, నచ్చని వారు ఓడిపోయేలా చేసే పనిని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. దాంతో… ఎవరికి తోచి రీతిలో వారు ఈ నలుగురిపై తమ ప్రతాపం చూపించారు. ఆర్జే కాజల్ ఓ అడుగు ముందుకేసి విశ్వ సైకిల్ పై ఆయిల్ పోసి అతను ఓడిపోయేలా చేసింది. దాంతో కాజల్ కు సరయుకు మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. మహిళలు గెలవాలన్నది తన కోరిక అని ఒకానొక సందర్భంలో చెప్పిన కాజల్… మగవాళ్ళలో కేవలం విశ్వను మాత్రమే టార్గెట్ చేయడాన్ని సరయు పాయింట్ అవుట్ చేసింది. అయితే… మొదట విశ్వను, ఆ తర్వాత మానస్ ను పోటీ నుండి తప్పించాలన్నది తన అభిమతం అని కాజల్ సర్థి చెప్పింది. నిజానికి ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్న విశ్వ ఈ టాస్క్ లో గెలుస్తాడని చాలా మంది భావించారు. కానీ కారణం ఏదైనా విశ్వ, మానస్, హమీదా ఓడిపోగా… సిరి విజయం సాధించింది. ఆ రకంగా సిరి బిగ్ బాస్ సీజన్ 5 తొలి కెప్టెన్ గా ఎంపికైంది.
ఇక ప్రియాకు బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు నిదానంగా పెద్దరికం ఇవ్వడం మొదలెట్టారు. ఆమె సిరికి కెప్టెన్సీ బాండ్ ను పెట్టింది. సిరి… రేషన్ మేనేజర్ గా విశ్వను నియమించింది. ఇదే సమయంలో వెజ్, నాన్ వెజ్ వ్యవహారంలో ఉమా – లహరి అసందర్భంగా మాటా మాటా అనేసుకున్నారు. ఇక నాలుగో రోజు ఉదయమే తనను ఫ్లట్ చేయాలని చూసిన లోబోను ప్రియాంక ఓ రేంజ్ లో ఆడుకుంది. ఆమెకు రవి కూడా పరోక్షంగా మద్దత్తు ఇవ్వడం విశేషం. ఏదేమైనా నాలుగో రోజు సింగర్ రామచంద్ర సైతం కాస్తంత లైన్ లోకి వచ్చాడు. మూడో రోజు షోను ఏడుపులు డామినేట్ చేయగా, నాలుగో రోజు ఆ స్థానంలో వాదోపవాదాలు హైలైట్ అయ్యాయి.