గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ ముందే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించిన బిగ్ బాస్ ఈసారి మాత్రం పవర్ రూమ్ కు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరినీ పిలిచి, తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని కోరాడు. దాంతో అందరూ తమ మనసులోని వారిని నిర్మొహమాటంగా నామినేట్ చేసేశారు. తీరా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు బిగ్ బాస్. దాంతో అక్కడ ఉన్న 15 మంది కంటెస్టెంట్స్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది.
నామినేషన్స్ ఫస్ట్ ప్లేస్ లో షణ్ముఖ్
యూ ట్యూబర్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్, ఇటీవలే వెబ్ సీరిస్ లోనూ నటించడం మొదలెట్టిన షణ్ముఖ్ గడిచిన నాలుగు వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు. కానీ చిత్రంగా ఐదోవారంలో ఏకంగా ఎనిమిది మంది హౌస్ మేట్స్ అతన్ని నామినేట్ చేసి పెద్ద షాక్ కు గురిచేశారు. గతంలో షణ్ముఖ్, సిరి ఒక జట్టుగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జెస్సీ కెప్టెన్ అయ్యాడో, అప్పటి నుండీ అతన్ని కూడా తమ జట్టులో వాళ్ళిద్దరూ కలిపేసుకున్నారు. దాంతో ఈ ముగ్గురి గూడుపుఠాణీ తట్టుకోలేక పోయిన హౌస్ మెంబర్స్ మొదట షణ్ముఖ్ ను టార్గెట్ చేశారు. షణ్ముఖ్ – జెస్సీలను విశ్వ, రవి, మానస్, శ్రీరామ్ నామినేట్ చేయగా, అదనంగా షణ్ముఖ్ ను సన్నీ, లోబో, హమీద, ప్రియా నామినేట్ చేశారు.
తర్వాత స్థానంలో నిలిచిన రవి, జెస్సీ
నామినేషన్స్ లో షణ్ముఖ్ తర్వాత అత్యధికంగా నాలుగేసి నామినేషన్స్ అందుకున్న వారు ఇద్దరున్నారు. వారిలో ఒకరు జెస్సీ కాగా మరొకరు రవి. ఎక్కువ సమయాన్ని షణ్ముఖ్ తో జెస్సీ గడపడం, అన్ బాలెన్సెడ్ గా ఉండటం వల్ల అతన్ని నామినేట్ చేస్తున్నట్టు సభ్యులు చెప్పారు. అలానే రవి అందరినీ డామినేట్ చేయడానికి, ఇన్ ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అభియోగంతో అతన్ని నలుగురు నామినేట్ చేశారు. ఇక మూడో స్థానంలో మూడు నామినేషన్స్ తో మానస్ నిలువగా, రెండేసి నామినేషన్స్ తో లోబో, సన్ని, విశ్వ, హమీదా, ప్రియా నిలిచారు. ఆ రకంగా ఐదో వారంలో బిగ్ బాస్ హౌస్ షో అత్యధికంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. షణ్ముఖ్ లానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మొదటిసారి విశ్వ నామినేట్ కావడం విశేషం. అతన్ని యానీ, షణ్ముఖ్ నామినేట్ చేశారు.
ఒకే ఒక్క శ్వేత వర్మ!
బిగ్ బాస్ సీజన్ 5 షో మొదలై చూస్తుండగానే 29 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకూ జరిగిన ఐదు నామినేషన్స్ లోనూ ఒక్కసారి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళకుండా ఉంది కేవలం శ్వేత వర్మ మాత్రమే. అందుకు కారణం లేకపోలేదు. శ్రీరామ్, హమీదా ఒక జంటగా, మానస్, శ్రీరామ్, ప్రియాంక మరోగ్రూప్ గా వ్యవహరిస్తుంటారు. అలానే ఇంకో వైపు సిరి, షణ్ముఖ్, జెస్సీ జట్టు కట్టారు. ప్రియా, యానీ, కాజల్ ముగ్గురి మధ్య కూడా చక్కని స్నేహ బంధమే ఉంది. అయితే ఎవరితోనూ జట్టు కట్టకుండా తన గేమ్ తాను ఆడుతోంది శ్వేత వర్మ. అందుకే ఆమె జోలికి ఎవరూ పోవడం లేదు. ఆమె కూడా గతంలో తనను నామినేట్ చేసిన వారినే తిరిగి నామినేట్ చేస్తూ సేఫ్ గేమ్ ప్లే చేస్తోంది. అందువల్లే ఇంతవరకూ శ్వేతవర్మను బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ టార్గెట్ చేయలేదు.
అన్నంపై అలిగిన జస్వంత్!
నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే బిగ్ బాస్ హౌస్ మొత్తం రెండుగా చీలిపోయింది. మిగిలిన వారి అసంతృప్తి మాట ఎలా ఉన్నా, తనను జెస్సీ తప్ప హౌస్ లోని మగవాళ్ళంతా నామినేట్ చేయడాన్ని షణ్ణు తట్టుకోలేకపోయాడు. కారణం ఏమిటని అడగటానికి కూడా అతను మానసికంగా సిద్థం కాలేదు. జెస్సీ, సిరి ఎప్పటిలానే అతని పక్కన కూర్కుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇంతవరకూ మౌనంగా ఉన్న తాను ఇకమీదట ఆట చూపిస్తానని షణ్ణు అనడం విశేషం. నిజానికి నాగార్జున సైతం షణ్ముఖ్ నుండి ఇదే కోరుకున్నాడు. అతనిలో ఫైర్ ఉంది కానీ చూపించడం లేదని భావించాడు. ఇప్పుడు హౌస్ లోని 15 మందిలో మెజారిటీ మెంబర్స్ (8మంది) తనను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ నిజంగానే తన ప్రతిభను ఈ వారం చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే… ఇటు షణ్ణ్ముఖ్, అటు సిరి ఇద్దరూ జెస్సీకి కిచెన్ లో అవమానం జరిగిందనే భావనతో శ్రీరామ్ మీదకు దూసుకెళ్ళారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకోకుండా జెస్సీకి ఆహారం ఇవ్వనని శ్రీరామ్ చెప్పడం తప్పంటూ ఆవేశ పడ్డారు. శ్రీరామ్, యానీ మాస్టర్ సర్థి చెప్పే ప్రయత్నం చేసినా, వారి ఆవేశం చల్లారలేదు. ఎవరి వంట వారే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను తప్పితే ఆహారం ఇవ్వనని అనలేదని శ్రీరామ్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత షణ్ణు, సిరి తప్పు చేశామేమో అనే భావనకు గురయ్యారు. అదే సమయంలో జెస్సీని యాని మాస్టర్, లోబో భోజనం చేయమని బలవంతం చేశారు. ఆ రాత్రికి భోజనం చేయకూడదని నిర్ణయించుకున్న జెస్సీ, షణ్ముఖ్ లకు శ్రీరామ్ భోజనం తీసుకొచ్చి తినిపించాడు. అయితే… కిచెన్ లో జరిగిన గొడవ సోమవారం నాటికి నివురు గప్పిన నిప్పులా ఉంది తప్పితే, చల్లారి పోలేదు. మర్నాడు కూడా అది బాగానే రాజుకుందని చివరిలో చూపించిన ప్రోమోతో తెటతెల్లమైంది.