Lunar Eclipse: సెప్టెంబర్ 7 రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూతక కాలం ఇప్పటికే ప్రారంభమైంది. సూతక కాలంలో దేవాలయాలను మూసేస్తారు. దర్శనం, పూజ సమయాలు మార్చుతారు. కానీ.. గ్రహణం సూతక కాలం ప్రభావితం కాని కొన్ని దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ సూతక కాలంలో అన్ని ఆలయాలు మూసి ఉంటే ఈ ఆలయాల్లో మాత్రం దర్శణాలు, పూజలు యాథావిథిగా కొనసాగుతాయి. ఆ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం…
శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ తలుపులు గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. స్వయంభు మహాకాళ రూపంలో ఉన్న శివుడిపై గ్రహణం ప్రభావం ఉండదు. అందువల్ల, గ్రహణ సమయంలో ఈ ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి.
కల్కాజీ ఆలయం…
ఢిల్లీలోని కల్కాజీ ఆలయం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. అన్ని గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయి. అటువంటి పరిస్థితిలో గ్రహణం ఆమెను ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతే కాదు.. గ్రహణ సమయంలో భక్తులు దర్శనం, ప్రత్యేక పూజల నిమిత్తం ఈ ఆలయానికి వస్తారు.
ఉత్తరాఖండ్ లోని కల్పేశ్వర్..
గ్రహణ సమయంలో ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలోని శివుడు గంగా మాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. గ్రహణ సమయంలో ఈ ఆలయంలో యథావిథిగా దర్శణాలు కొనసాగుతాయి.
కేరళలోని తిరువర్ప్పు వద్ద శ్రీ కృష్ణ ఆలయం…
కేరళలోని కొట్టాయంలోని తిరువర్ప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యం పెడతారు. ఇక్కడ స్వామికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆకలి కారణంగా స్వామి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. అందువల్ల, గ్రహణ సమయంలోనూ ఈ ఆలయ తలుపులు మూసివేయరు. స్వామికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు.
గయ విష్ణుపాద ఆలయం..
గ్రహణ సమయంలో పిండదానం చేయడం మంచిదని నమ్మకం. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం తెరిచే ఉంటుంది.
లక్ష్మీనాథ్ ఆలయం…
రాజస్థాన్‌లోని బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని గ్రహణాల సమయంలో మూసివేయరు. ఒకసారి గ్రహణ సమయంలో తలుపులు మూసివేసి దేవునికి ఆహారం నైవేద్యం పెట్టలేదట. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక దుకాణంలోని మిఠాయి వ్యాపారికి కల వచ్చిందట. కలలో దేవుడు ప్రత్యేక్షమై తనకు ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణాల సమయంలోనూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది.