Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగించారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. కాగా.. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపాల పండగ.. 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభమే కోటి దీపోత్సవం. ఈ మహాక్రతువుకు గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరుకానున్నారు..
రెండవ రోజు 2-11-2025 (కార్తిక ఆదివారం – క్షీరాబ్దిద్వాదశి) విశేష కార్యక్రమాలు..
పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ (పుష్పగిరి మహాసంస్థానం), శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ (తలకాడు శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం)ల అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రవచనామృతం నిర్వహిస్తారు. అలాగే.. వేదికపై శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటితులసి అర్చన, తిరువనంతపురం శ్రీ అనంతపద్మనాభస్వామికి మహాపూజ వైభవంగా జరుపుతారు. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటితులసి అర్చన ఉంటుంది. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణం నిర్వహిస్తారు. చివరిగా కల్పవృక్ష వాహన సేవతో ముగుస్తుంది.