కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, గ్రంధాలు చెబుతున్నాయి.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఇష్టమైన మాసం.. అందుకే చాలా పవిత్రంగా చూస్తారు.. కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదని పురాణాలుతెలుపుతున్నాయి.. ఈ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనదే.. పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చెయ్యాలో,చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయల మీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి.. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు..
కార్తీక పౌర్ణిమ నదీ స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణ పరంగా మనకు ఎంతో ఆరోగ్య ప్రదం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజిగా ఉండి, ఆలయాలకు వెళ్లలేని వాళ్లు చంద్రుడిని పూజించడం మంచిది.. ఆయనకు దీపం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే చలిమిడి కూడా చేసి నైవేద్యం సమర్పిస్తే మంచిది.. ఇక ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, సత్యనారాయణ వ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలు చేస్తారు. ఇలా శివుడి అనుగ్రహం పొందుతారు..