Ayyappa Mala: సాధారణంగా ప్రతి ఏడాది కార్తీక మాసం నుంచి.. మకర సంక్రాంతి వరకూ ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామి వారి భక్తులు మాలలు ధరించడానికి సన్నద్ధం అవుతున్నారు. దక్షిణ భారతదేశం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసిద్ధమైనది. దేశం నలుమూలలు నుంచి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోడానికి శబరిమలకు వస్తుంటారు.
READ ALSO: Bigg Boss 9 : దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి పెరుగుతున్న క్రేజ్..
నియమ నిష్టలతో 41 రోజుల దీక్ష ..
స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తులు 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుమడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. వాస్తవానికి అయ్యప్ప దీక్షలో నియమాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్వాములందరూ ఈ 41 రోజులు చాలా కఠినమైన నియమ నిష్టలతో దీక్ష కొనసాగిస్తారు. ఈ దీక్ష కాలంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఒకరకంగా చెప్పాలంటే ఒక యోగిలా జీవించాలి. అబద్ధాలు ఆడకూడదు, ఇతరులను దూషించడం, పరుష పదాలను వాడటం చేయకూడదు. ఇతరులను మోసం చేయడం మహా పాపం. ఈ దీక్ష సమయంలో నిత్యం స్వామి చింతనలో ఉంటూ.. శరణం అయ్యప్ప అని పఠించాలి.
ఈ దీక్ష తీసుకునే సమయంలో స్వాములు.. గురుస్వామి లేదా తల్లిదండ్రుల నుంచి అయ్యప్ప మాల ధరించాలి. గురుస్వామికి, తల్లిదండ్రులకు, పెద్దలకు తప్పకుండా పాదాభివందనం చేయాలి. స్నానం చేసేటప్పుడు, పాద పూజ చేసేటప్పుడు మాల నేలకు తాకకూడదు. మెడలో ధరించిన రుద్రాక్ష లేదా తులసి మాల ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలో నుంచి తీయకూడదు. మాల ధరించిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ స్వామి అని సంబోధించాలి. నుదుటిపై ఎప్పుడూ విభూధి, చందనం, కుంకుమ ధరించాలి. నిత్యం స్వామియే శరణమయ్యప్ప అని మూల మంత్రాన్ని జపించాలి. అశుభ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. దీక్షలో ఉండగా రక్తసంబంధీకులు, దగ్గరి బంధువులు, దాయాదులు ఎవరైనా మరణిస్తే మాలను తీసివేయాలి.
41 రోజుల ఈ దీక్ష సమయంలో స్వామిమాల ధరించిన వాళ్లు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించాల్సి ఉంటుంది. ఈ స్వాములు ఉదయం, సాయంత్రం నిష్టతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజ, కర్పూర హారతి, భజన వంటి పూజలు చేయాలి. ఈ 41 రోజులు వీళ్లు నేలపై లేదా దుప్పటి వంటి వస్త్రం వేసుకుని పడుకోవాల్సి ఉంటుంది. దీక్ష సమయంలో స్వాములు పాదరక్షలు ధరించడం, క్షవరం, జుట్టు, గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు.
అయ్యప్ప దీక్ష ఆచరించే భక్తులు 41 రోజుల పాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం, ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు వంటి ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉండాలి. తక్కువ ఆహారం అది కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. స్వామి దీక్ష స్వీకరించిన స్వాములు కేవలం నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. దీక్ష సమయంలో స్వాములు వాళ్ల శక్తి మేరకు కనీసం ఐదు మంది అయ్యప్ప స్వాములకు అయినా భిక్ష పెట్టాలి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిని తెలియజేశాము.
READ ALSO: Keir Starmer Aadhaar: ఆధార్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు .. బ్రెట్ కార్డ్ నమూనాగా ఇండియన్ ఆధార్