Tesla Model Y: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ముంబైలో తన తొలి షోరూంను ఓపెన్ చేసింది. టెస్లా ముందుగా తన మోడల్ Y కారును విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అమ్మకాల్లో ఈ కారే అధికంగా అమ్ముడైంది. ఈ బ్రాండ్ భారతదేశంలో RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్‌లను అమ్మకానికి ఉంచుతుంది.
RWD వేరియంట్ ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు కాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ కారు ధర రూ. 67.89 లక్షలుగా ఉంది. వీటి ‘‘ఆన్ రోడ్’’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలకు చేరుకుంటుంది. లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలకు చేరుకుంటుంది. టెస్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
Read Also: Gandikota: గండికోటలో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. నిందితుల కోసం గాలింపు..!
టెస్లా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఇలా చేస్తే, ఆన్ రోడ్ ధరల్లో మార్పులు వస్తాయి. ఉదాహరణకు FSD (ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్) యాడ్ ఆన్ పొందడానికి వినియోగదారులు మరో రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మోడల్ Y ప్రారంభ ధర USలో $44,990 (సుమారు రూ. 38.63 లక్షలు), చైనాలో 263,500 యువాన్లు (సుమారు రూ. 31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (సుమారు రూ. 46.09 లక్షలు)గా ఉంది. ప్రస్తుతం, భారత్‌లోనే ఈ కార్ల ధరలు అత్యంత ఖరీదైన వాటిగా ఉన్నాయి. ప్రధానంగా దిగుమతి పన్నులు, లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.
టెస్లా మోడల్ Y రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ భారతీయ మార్కెట్లో 60 kWh, పెద్ద 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. వెనక వైపు ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది దాదాపుగా 295 హెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 60 kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 500 కి.మీ, లాంగ్ రేంజ్ ఒక్క చార్జింగ్‌లో 622 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ కారులో 15.4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే ముందు వైపు ఉంటే, 8-అంగుళాల డిస్ల్పే వెనక వైపు ఉంటుంది. పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, స్టీరింగ్ కాలమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 19-అంగుళాల క్రాస్‌ఫ్లో వీల్స్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ మరియు పవర్ రియర్ లిఫ్ట్‌గేట్ వంటి ఫీచర్లు ఉంటాయి. మొత్తం టెస్లా మోడల్ Y 7 ఎక్స్‌టీయర్ రంగుల్ని కలిగి ఉంటుంది.