టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తమ కొత్త తరం సియెర్రా SUVను 2025 నవంబర్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో రూపొందించిన ఈ SUV వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టాటా సియెర్రాను ఎలక్ట్రిక్‌తో పాటు ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే.. సియెర్రా SUV ప్రారంభ ధరను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇటీవల మిగిలిన అన్ని వేరియంట్‌ల ధరలను కూడా అధికారికంగా ప్రకటించింది. ధరల ప్రకటనతో పాటు బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.21,000 టోకెన్ మొత్తంతో ఈ SUVను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ త్వరలోనే డెలివరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ మోడల్‌తో మధ్యతరగతి మరియు ప్రీమియం SUV విభాగాల్లో టాటా మోటార్స్ గట్టి పోటీని అందిస్తూ, భారత మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేయనుంది.
టాటా సియెర్రా ప్రీమియం క్యాబిన్‌తో వస్తోంది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌లు ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకటి డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మిగతా రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం అందించబడ్డాయి, వీటితో కంటెంట్‌ను సులభంగా షేర్ చేసుకునే సౌకర్యం ఉంది. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన క్యాబిన్ ఈ SUVకు మరింత విలాసవంతమైన ఆధునిక అనుభూతిని అందిస్తోంది.