Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రాలను దాటి దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. నెక్సాన్ కాంపాక్ట్ SUVకు ఉన్న బలమైన డిమాండ్, తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన సియెర్రా మోడల్ నుంచి వచ్చిన ప్రారంభ అమ్మకాలే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వాహన నమోదు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. FY26 మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1.89 లక్షల ప్యాసింజర్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. అదే సమయంలో మహీంద్రా 1.80 లక్షలు, హ్యుందాయ్ 1.70 లక్షల యూనిట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాయి. దీంతో టాటా ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. డిసెంబర్ 2025లో కూడా టాటా రెండో స్థానంలో నిలిచి, సంవత్సరం రెండో భాగంలో కనిపించిన వృద్ధిని కొనసాగించింది. అయితే మొత్తం 2025 ఏడాదిలో టాటా మోటార్స్ మూడో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగానే నిలిచింది.
READ MORE: Russia-Ukraine: న్యూఇయర్ వేళ రష్యాపై భారీ డ్రోన్ దాడి.. 24 మంది మృతి
ఈ ఏడాదిలో టాటా 5.92 లక్షల వాహనాలను విక్రయించగా, మహీంద్రా 6.07 లక్షల యూనిట్లు అమ్మింది. మారుతి సుజుకి మాత్రం ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా.. 2025 రెండో భాగంలో టాటా పనితీరు గణనీయంగా మెరుగుపడింది. దీనికి ప్రధాన కారణం నెక్సాన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల నెక్సాన్‌కు స్థిరమైన డిమాండ్ కొనసాగింది. అలాగే, 2025 చివర్లో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన సియెరా SUV ప్రారంభ అమ్మకాలు కూడా టాటాకు లాభం చేకూర్చాయి. వాహన్ డేటా ప్రకారం, డిసెంబర్ 2025లో టాటా మోటార్స్ 51,963 యూనిట్లు విక్రయించింది. అదే నెలలో హ్యుందాయ్ 48,312 యూనిట్లు, మహీంద్రా 47,493 యూనిట్లు మాత్రమే అమ్మాయి. సరఫరా పరిస్థితులు మెరుగుపడటం, SUV మోడళ్ల శ్రేణి పెరగటం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో స్థిరమైన పనితీరు టాటాకు ఈ త్రైమాసికంలో బలంగా నిలిచేలా చేశాయి.