Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో దేశీయంగా 81,790 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. అయితే గతేడాది దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలను పరిశీలిస్తే 54,119 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. జూలై 2021తో పోలిస్తే.. ఈ ఏడాది జూలైలో దేశీయ అమ్మకాలే 78,978 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. దేశీయ అమ్మకాల్లో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో కూడా టాటా దూసుకుపోతోంది. గతేడాది జూలైతో పోలిస్తే 2022 జూలైలో 604 యూనిట్ల నుంచి 4022 యూనిట్ల అమ్మకాలకు పెరిగినట్లు టాటా వెల్లడించింది. డొమెస్టిక్ మార్కెట్ లో వాణిజ్య వాహన విక్రయాలు జూలై 2022లో 31,473 యూనిట్లుగా ఉన్నాయని.. 2021లో జూలైలో కేవలం 21,796 ఉన్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
Read Also: Two Sets Of Twins: ప్రపంచంలోనే అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జంట కవలలకు జన్మనిచ్చిన మహిళ
ఇదిలా ఉంటే మరో ఆటో మేకర్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జూలై సెల్స్ లో 31 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా నుంచి తాజాగా విడుదలైన స్కార్పియో – ఎన్ మోడల్ జూలై 30 లోపు లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్స్ ప్రారంభం అయిన నిమిషాల్లోనే మహీంద్రా షేర్ల విలువ 6.37 శాతం పెరిగి రూ. 1239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జూలై నెలలలో మహీంద్రా మొత్తం 56,148 వాహనాలకు అమ్మింది. ఇందులో యుటిలిటీ వాహనాలు 27854 ఉండగా.. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో 28,053 వాహనాలను అమ్మింది. మహీంద్రా ఎక్స్ యూ వీ 700, థార్, బొలెరో, ఎక్స్ యూ వీ 300 తీవ్రమై డిమాండ్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.