దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్‌లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్‌లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది. మరోసారి సంస్థ రికార్డు బద్ధలు గొట్టింది. ముఖ్యంగా ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా 62,788 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో స్విఫ్ట్ డిజైర్ వంటి మోడళ్లు ఉన్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
ఎగుమతుల్లో భారీ జంప్..
ఎగుమతుల పరంగా కూడా మారుతీ సుజుకి అద్భుతమైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 2024లో కంపెనీ 37,419 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది 26,884 యూనిట్లతో పోలిస్తే 39.1% పెరిగింది. ఇదే కాకుండా.. 2024లో మారుతీ అన్ని సెగ్మెంట్లలో భారీ విక్రయాలు జరిపింది. డిసెంబర్ 2024లో ప్రతి విభాగంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది.
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్: స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సియాజ్ వంటి ప్యాసింజర్ కార్ల విభాగంలో 62,788 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 48,787 యూనిట్లు ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదికి ఇప్పటికి విక్రయాల్లో భారీ మార్పు జరిగింది.
యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్: బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్‌ఎల్ 6 వంటి వాహనాలు యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్ విభాగంలోకి వస్తాయి. ఈ విభాగంలో 55,651 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 45,957 యూనిట్లుగా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ..
కాగా.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు మారుతీ ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వని ఈ సంస్థ తన పాపులర్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కొత్త ఈవీ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈమేరకు ఫస్ట్ ఈవీకి సంబంధించిన లుక్‌ను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసింది.