Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన కొత్త వెన్యూ(Venue) కోసం బుకింగ్ ప్రారంభించింది. ఆల్ న్యూ వెన్యూ సరికొత్త డిజైన్, స్టైల్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులతో రాబోతోంది. కొత్త వెన్యూ నవంబర్ 04న అధికారికంగా లాంచ్ కాబోతోంది. దీంతో, కస్టమర్ల కోసం హ్యుందాయ్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. కస్టమర్లు హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రూ. 25,000 చెల్లించి కొత్త వెన్యూను రిజర్వ్ చేసుకోవచ్చు. కొత్తగా వస్తున్న వెన్యూ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వస్తోంది.
కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం, కొత్త వెన్యూ పొడవు, వెడల్పులు పెరుగుతున్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే లాంగ్ వీల్ బేస్ కలిగి ఉంటుంది. క్యాబిన్ స్పేస్ కారును మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. కొత్త వెన్యూ కొలతల్ని పరిశీలిస్తే.. 3,995 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు మరియు 1,665 మిమీ ఎత్తు, వీల్‌బేస్ 2,520 మిమీగా ఉండబోతోంది. గతంలో పోలిస్తే వీల్ బేస్ 20మిమీ ఎక్కువ.
Read Also: Khyber Pakhtunkhwa: పాక్ చేతుల్లొంచి జారిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ? .. దాయాది దేశంలో ఏం జరుగుతుంది!
డిజైన్ మార్పులలో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, క్వాడ్-బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ట్విన్ LED DRLలు, హోరిజోన్-స్టైల్ LED టెయిల్ లాంప్‌లు, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండబోతోంది. 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్యాబిన్‌కు మరింత అందాన్ని తీసుకురాబోతోంది. క్యాబిన్ డార్క్ నేవీ, డవ్ గ్రే రంగులలో డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ర్రాజో-టెక్చర్డ్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, రియర్ విండో సన్‌షేడ్‌లు, ఫోర్-వే పవర్ డ్రైవర్ సీటు కలిగి ఉంటుంది.
ఇంజన్ల విషయానికి వస్తే 1.2-లీటర్ కప్పా పెట్రోల్, 1.0-లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్లు ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్‌లు కలిగి ఉంటుంది. 2025 హ్యుందాయ్ వెన్యూ ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను అందుబాటులో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ టాటా నెక్సాన్, మహీంద్రా 3XO, కియా సోనెట్‌కి పోటీ ఇస్తుంది.