BYD: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD సత్తా చాటుతోంది. ఈవీ కార్ల అమ్మకాల్లో అమెరికా దిగ్గజ సంస్థ, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లాను అధిగమించింది. 2023 నాలుగో త్రైమాసికంలో టెస్లా 4,84,507 వాహనాలను విక్రయించింది. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం అధికం. అయితే టెస్లా ప్రత్యర్థి, చైనీస్ టెస్లాగా పిలువబడే BYD ఇదే కాలానికి 5,26,409 కార్ల అమ్మకాలను నివేదిందించింది. నాలుగో త్రైమాసికంలో BYD, టెస్లాను అధిగమించింది.
ఈవీ మార్కెట్‌లో టెస్లాకు గండి కొట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆటోమేకర్స్ ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. దీంతోనే టెస్లా అమ్మకాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం ఈ వార్త రాగానే టెస్లా స్టాక్‌పై దెబ్బపడింది. 1995లో బ్యాటరీ తయారీ కంపెనీగా ప్రారంభమైన BYD, ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా టెస్లాతో పోలిస్తే బీవైడీ ధర తక్కువ ఉండటం కూడా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్ని ఆకర్షిస్తోంది.
అయితే నాలుగో త్రైమాసికంలో టెస్లా కార్ల అమ్మకాలు కాస్త తగ్గినప్పటికీ.. వార్షిక అమ్మకాల్లో టాప్ పొజిషన్ లోనే ఉంది. డిసెంబర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా 1.8 మిలియన్ల కంటే ఎక్కువ ఈవీలను అమ్మింది. వార్షికంగా చూస్తే 38 శాతం పెరిగింది. ఇక BYD విక్రయాల సంఖ్య 1.6 మిలియన్ కంటే తక్కువగా ఉంది, ఇది సంవత్సరానికి 73 శాతం పెరుగుదలను సూచిస్తుంది.