Tesla: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జూలై 15న భారత్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భారత మార్కెట్‌లోకి టెస్లా అధికారికంగా ప్రవేశించబోతోంది. ముంబైలోని ప్రముఖ వ్యాపార జిల్లా అయిన అప్‌స్కేల్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న షోరూంలో సందర్శకుల కోసం టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, దాని టెక్నాలజీని తెలుసుకునేందుకు అవకాశం అందిస్తోంది. అయితే, టెస్ట్ డ్రైవ్, వాహన డెలివరీలు అందుబాటులో ఉండదని భావిస్తున్నారు.
లాంచ్‌కు ముందు టెస్లా దాదాపు 1 మిలియన్ డాలర్ల విలువైన వాహనాలు, సూపర్ చార్జర్లు, ఇతర పరికరాలను భారతదేశంలోకి దిగుమతి చేసింది. ఇవి ప్రధానంగా, అమెరికా, చైనా నుంచి వచ్చాయి. దిగుమతి అయిన వాటిలో టెస్లా ప్రముఖ మోడల్ Y SUV ఆరు యూనిట్లు ఉన్నాయి. అయితే, భారత్‌లో తయారీ చేసేందుకు టెస్లా ప్రస్తుతానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దిగుమతి చేసుకున్న వాటినే అమ్మేందుకు ఇష్టపడుతోందని ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.
ప్రస్తుతం టెస్లాకు దేశంలో నాలుగు కమర్షియల్ సైట్లు ఉన్నాయి. వీటిలో కొత్త ముంబై షోరూమ్, కుర్లా వెస్ట్‌లో ఒక సర్వీస్ సెంటర్, పూణేలో ఒక ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో దాని రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్నాయి. ప్రపంచ డిమాండ్ మందగించడం, అదనపు ఉత్పత్తి సామర్థ్యంతో టెస్లా ఇబ్బంది పడుతున్నందున భారతదేశంలో ప్రారంభించాలని భావిస్తోంది.