CM YS Jagan: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది.. 18 మంది పేర్లను ఖరారు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఆ తర్వాత క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. తనను కలిసిన అభ్యర్థులతో కాసేపు మాట్లాడిన సీఎం జగన్.. కీలక సూచనలు చేశారు.. ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయాన్ని చేస్తున్నాం.. ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం.. 18 మంది పేర్లను ఖరారు చేశాం.. అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వారే ఉన్నారు.. మిగిలిన వారికి 4 సీట్లు ఇచ్చాం.. ఇందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కటి ఇచ్చామన్నారు.. అయితే, మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి.. ప్రతి నియోజకవర్గంలో చెప్పాలి.. ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదన్నారు.
ఇక, ఇంత పారదర్శకంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈరోజు మనం చేసింది ఒక ఎత్తు.. పదవులు తీసుకున్న వారు యాక్టివ్‌గా ఉండాలి.. విపక్షాల తప్పుడు ప్రచారంపై మనం కూడా అదే స్థాయిలో మన వాణిని వినిపించాలని సూచించారు. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్నవారు.. పార్టీ కోసం ఏం చేయగలుగుతామో.. అన్న అడుగులు వేయాలని స్పష్టం చేసిన ఆయన.. నేను చేయాల్సింది.. నేను చేశాను. ఇవ్వాల్సింది ఇచ్చాను.. పార్టీ పరంగా మీ బాధ్యతను నిర్వర్తించాలని, మీ తరఫు నుంచి కోరుతున్నాను అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఈ సందర్భంగా పదవులు పొందుతున్న వారందరికీ శుభాంకాక్షలు తెలిపారు సీఎం జగన్.. పదవులు ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు.. ఉన్న పదువులు తక్కువ కాబట్టి.. అందర్నీ సంతృప్తి పరచలేమన్న ఆయన.. ఆశావహులందరికీ చెప్పే రీతిలో చెప్పుకుంటూ, వారి కన్విన్స్ చేసుకుంటూ పోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే అధికార పార్టీని స్థాపించాం.. అధికారంలోకి వచ్చాం.. దేవుడి దయవల్ల మంచి పరిపాలన కొనసాగుతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 , వై నాట్ అన్నరీతిలో పరిపాలన కొనసాగుతోందన్నారు.. గత ఎన్నికల్లో మెజార్టీ కంటే.. అత్యధిక మెజార్టీలు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరింత మందికి మేలు చేస్తాం అన్నారు. ఈ సారి మనం వడ్డీలకు, వడ్డెరలకు అనే కులాలకు ఇచ్చాం.. మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.