Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సర్కారుపై ప్రభుత్వ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పీఆర్సీ, జీతభత్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు కొద్దిగా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నా కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే తెలిపారు. వ్యక్తిగత ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య స్వల్పమని.. లక్షల మంది ఉన్న విద్యార్థులు అనుకుంటే వారి తల్లిదండ్రులతో ఓట్లు వేపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.
Read Also: YSRCP: గూడూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే వరప్రసాదరావుపై అసంతృప్తి
కాగా తన రాజకీయ జీవితంలో ఏనాడూ దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడలేదని ఇటీవల ఓ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు. తనపై ఆరోపణలను చేతనైతే నిరూపించాలని సవాల్ విసిరారు. తాను స్వచ్ఛందంగా తనపై వచ్చిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సీబీఐ విచారణ చేయాలని కోరబోతున్నట్లు వెల్లడించారు.