Local Body Elections: స్థానిక ఎన్నికల వేళ వైసీపీ బిగ్ వార్నింగ్.. కలెక్టర్లు, ఎస్పీల వరకు అందరికీ లీగల్ నోటీసులు!

Ysrcp Legal Notices

Ysrcp Legal Notices

Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ తీవ్ర స్థాయిలో న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఎన్నికల అధికారుల వరకు అందరికీ లీగల్ నోటీసులు పంపింది. వైసీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ ఈ నోటీసులను జారీ చేశారు. రూల్స్ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా మరోసారి నోటీసులు ఇవ్వబోమని, బాధ్యులైన అధికారులపై వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ చర్యల కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగంలో కలకలం మొదలైంది.

గత అక్టోబర్ 27, 2026న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో తు.చ. తప్పకుండా అమలు చేయాలని వైసీపీ తన నోటీసుల్లో తేల్చిచెప్పింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 16న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకూ వర్తింపజేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 144 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు స్వేచ్ఛగా, నిష్పక్షపాత వాతావరణంలో పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.

పల్నాడు, కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులపై దాడులు, నిర్బంధాలు, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బలవంతంగా ఉపసంహరింపజేయడం వంటి ఘటనలు జరిగాయని, వీటిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయని నోటీసులో ప్రస్తావించారు. నామినేషన్లకు ఆటంకాలు కలిగించిన ఘటనలపై ఈసీ విచారణ జరిపి, అవసరమైతే నామినేషన్ల గడువును పొడిగించాలి. స్థానికంగా అడ్డంకులు ఉన్నచోట జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల వద్ద నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలి. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న సందర్భాల్లో బాధిత అభ్యర్థులకు ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసే హక్కు ఉంది. అభ్యర్థులు ఎలాంటి భయం లేకుండా నామినేషన్లు వేసేలా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎన్నికల ప్రక్రియ ఆసాంతం శాంతిభద్రతలను కాపాడటం పూర్తిగా డీజీపీ బాధ్యత అని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరగాలంటే ప్రతి అడుగు రికార్డు కావాలని వైసీపీ డిమాండ్ చేసింది. నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేదా వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన రోజే, అదే కేంద్రంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతున్నందున వీడియో రికార్డింగ్ ఒక్క క్షణం కూడా ఆగకూడదని తెలిపింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, చివరికి బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల రికార్డులను సీల్ చేసేంత వరకు నిరంతరాయంగా రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది.

రికార్డు చేసిన వీడియో ఫుటేజీని ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్దేశించిన గడువు ముగిసే వరకు, ఒకవేళ పిటిషన్లు దాఖలైతే వాటిపై తుది తీర్పు వెలువడేంత వరకు భద్రపరచాలని వైసీపీ కోరింది. ఎన్నికల ట్రిబ్యునల్ కోరినప్పుడు, ఎన్నికల పిటిషన్‌లోని పక్షాలు దరఖాస్తు చేసినప్పుడు ఆ వీడియో ఫుటేజీని అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. ఒకవేళ వీడియో రికార్డింగ్ చేయకపోయినా, ఫుటేజీని తొలగించినా, ధ్వంసం చేసినా, భద్రపరచకపోయినా దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీడియో ఫుటేజీ మాయమైనా, ధ్వంసమైనా ఆ విషయాలను బాధిత అభ్యర్థులు దాఖలు చేసే ఎన్నికల పిటిషన్లలో బలంగా ప్రస్తావిస్తామని వైసీపీ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే మరోసారి నోటీసులు ఇవ్వకుండానే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, తదుపరి జరిగే పరిణామాలకు సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీటితో పాటు వైసీపీకి, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చట్టపరంగా అందుబాటులో ఉన్న ఇతర అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కులను కొనసాగిస్తామని తేల్చిచెప్పింది.