ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. శని, ఆదివారాల్లో గుంటూరు-విజయవాడ జాతీయరహదారిపై నెలకొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళా ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. ఈ జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని.. ఆయా కంపెనీల్లో 26,289 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో హెల్త్ కేర్, మార్కెటింగ్, సేల్స్, ఎడ్యుకేషన్ సెక్టార్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయన్నారు. యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గర ఉండే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే అన్ని వివరాలు కనిపిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ జాబ్ మేళా వెబ్ సైట్‌లో 97 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. గతంలో తిరుపతి, విశాఖల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించి 30 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అందించామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన రెండు జాబ్ మేళాల్లో 347 కంపెనీలు పాల్గొన్నాయన్నారు.
