Nedurumalli Ramkumar Reddy Slams Anam Ramanarayana Reddy: అనేక ప్రచారాల అనంతరం తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నట్టు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా ప్రకటించారు. వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ నడిచింది. చివరకు టీడీపీలో చేరే అవకాశం ఉందని రామనారాయణ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు. నిజానికి ఆయన ముందు నుంచి పార్టీకి దూరం అవుతారనే సూచనలతో వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు తాజాగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయం మొదటి నుంచి ఊహించిందేనని అన్నారు.
మంత్రి పదవి రాలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారని, గడచిన నాలుగు సంవత్సరాలలో వెంకటగిరిని కలుషితం చేశారని అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎక్కడికక్కడ అవినీతి, అక్రమాలు చేశాడని పేర్కొన్న ఆయన మంత్రివర్గ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూశాడని ఆరోపించారు. వైసీపీని బ్రష్టుపట్టించాలనే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశాడని, నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ ఆపాడని అన్నారు. ఆనం విషయం తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను పక్కన పెట్టారని, వెంకటగిరి మున్సిపాలిటీలోని జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలు బయటపెడతానని ఆయన హెచ్చరించారు. రాజకీయ చరిత్ర అని చెప్పుకునే ఆనం కుటుంబం ఎంత మందిని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసింది? అని ప్రశ్నించారు.
Also Read: YV Subba Reddy: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి కౌంటర్
ఇక నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి పై జరిగిన దాడి హేయమైన చర్యేనని పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఘటనను ఆ రోజు ఆనం రామనారాయణరెడ్డి బ్లాక్ డే అన్నారు, కానీ అదే ఆనం వెంకటరమణారెడ్డిపై గతంలో ఆనం రామనారాయణరెడ్డి కర్ర తీసుకుని వెళ్లారు, ఆ ఘటనపై పోలీసుస్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దీనికి ఆనం ఏ బదులు ఇస్తారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇక రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్యేలను గతంలో కొనుగోలు చేసిన టీడీపీ, ఇప్పుడు వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యేలను తీసుకుంటోందని, అయితే అలా చేయడం వలన వైసీపీకి ఏమీ నష్టం లేదని అన్నారు. మంత్రి పదవి ఇవ్వ లేదని టిడిపిలోకి వెళ్లే ఆనంకు ఆ పార్టీలో మంత్రి పదవి ఇస్తారా ? అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అని రామ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2024లో మరలా అధికారంలోకి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు.