ఏపీలో రెండేళ్ల క్రిందట సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎట్టకేలకు అరెస్టుల పర్వం మొదలైంది. ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ… అతన్ని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచింది. కోర్టు సునీల్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సీబీఐ సునీల్ యాదవ్ ను కడప సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించింది. అయితే సునీల్ యాదవ్ ను మరింత విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సిబిఐ పిటిషన్ ను కోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హత్యతో సంబందం లేకున్నా సీబీఐ తనను ఇరికించిందని సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో సీబీఐ విచారణ పేరుతో పెట్టిన వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని సునీల్ యాదవ్ సోదరుడు కృష్ణయ్య యాదవ్ తెలిపారు. వివేకా హత్య కేసులో సునీల్ కు ఎలాంటి సంబందంలేదని వాదిస్తున్నారు.