ఏపీలోని మూడు ప్రాంతాల్లో శనివారం నాడు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రేపటి నుంచి మూడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జాబ్ మేళా ఉంటుందన్నారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. 35 నెలల్లో వైసీపీ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
టీడీపీ హయాంలో కేవలం వారి కులపు వారికే ఉద్యోగాలు కట్టబెట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో కులాలకు, మతాలకు అతీతంగా ఉద్యోగాలు ఇస్తున్నట్లు వివరించారు. జాబ్ మేళాల ద్వారా రాష్ట్రానికి 147 కంపెనీలు వస్తున్నాయని.. ఒక్క తిరుపతి సెంటర్‌కు మాత్రమే 41 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. సొంత పుత్రుడిని నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దిగుతారా.. లేకపోతే దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా అన్నది వేచి చూడాలని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
పొలిటికల్‌గా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పే వ్యక్తి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అని విజయసాయిరెడ్డి హితవు పలికారు. లోకేష్ శాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారంటే తనకు చాలా అనుమానాలు వస్తున్నాయన్నారు. 2024 తర్వాత టీడీపీ ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు జాబ్‌మేళాలో ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
Ambati Rambabu: చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది