Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని పేర్కొన్నారు.
Read Also: Harish Rao: గొల్ల కురుమలు ధర్మానికి కట్టుబడతారు
ఈ సమావేశానికి 225 మంది ప్రతినిధులు హాజరయ్యారని.. 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అందరి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో బీసీ సమావేశాలు నిర్వహించనున్నామని.. నవరత్నాల్లో 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. బీసీలు అంటే చంద్రబాబుకు బానిస క్లాసు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టామని.. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. అందుకోసం ఏ విషయంలో అయినా ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు.
అటు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను బానిసలుగా వాడుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఆ పరిస్థితిని మార్చారని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహించారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు బీసీలంతా అండగా నిలవాలని మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. ఏలూరు బీసీ గర్జన సభలో ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. తాను బీసీనే అయినా, రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో తనకు తెలియదని, కానీ బీసీల్లో 136 కులాలు ఉన్నాయని వెలికితీసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.