రాజధాని పరిధిలోని సీఆర్‌డీఏకు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొత్త అర్థం చెప్పారు. సీఆర్‌డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కాదని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ అని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. తుళ్లూరులో రైతులను బెదిరించి 52వేల ఎకరాలను లాక్కున్న చంద్రబాబు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రైతులతో కలిసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భూములు లేని పేదవారిని ఆదుకునేందుకు సీఆర్‌డీఏ ద్వారా తమ ప్రభుత్వం రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని భావిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లి మోకాలు అడ్డుపెట్టారని ఆరోపించారు.
ఖరీదైన భూములలో రాజధాని పెట్టాలని మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద తప్పు అని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని పెట్టాలనేది వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు. పట్టా భూములకు ఓ రేటు, అసైన్డ్ భూములకు మరో రేటు నిర్ణయించడం తగదని ఆమె పేర్కొన్నారు. కాగా త్వరలో జరిగే ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఉండవల్లి శ్రీదేవికి మంత్రి పదవి వస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.