దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు.. ఆ రాముడే మీ వెంట ఉంటాడని చెప్పుకొచ్చారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఈ యువకుల బైక్ యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో ఎంపీ మార్గాని భరత్ పర్యటనకు సంబంధించి వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
Read Also: Rajasthan Covid: ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పోస్ట్ కోవిడ్
ఇక, మూడు రోజులలో అయోధ్య చేరుకుంటామని ఆ యువకులు ఎంపీ మార్గాని భరత్ కు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, మిత్రులతో మాట్లాడటమే కాకుండా ‘యూ ట్యూబ్’ ద్వారా ప్రజలకు తమ ప్రయాణ వివరాలు తెలియజేస్తుంటామని చెప్పుకొచ్చారు. తాడేపల్లిగూడెంకు చెందిన ప్రణీత్ బైక్ పై ముంబాయి, కర్ణాటక వెళ్ళగా.. కాకినాడకు చెందిన తేజ్ తరుణ్ 19 రాష్ట్రాలు పర్యటించి వచ్చినట్లు ఎంపీ భరత్ కు వెల్లడించారు. వీరిద్దరూ ‘గోదావరబ్బాయి’ యూట్యూబ్, నేషనల్ ఈవెంట్స్ బైక్ రైడింగ్స్ లో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చారు.
Read Also: Delhi: సరికొత్త చరిత్ర సృష్టించిన ఢిల్లీ వైద్యులు
అయితే, అన్ని రకాల రక్షణ చర్యలు, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ బైక్స్ పై పర్యటించడం తమకు అలవాటని ఇద్దరు యువకులు ఎంపీ మార్గాని భరత్ కు వెల్లడించారు. రాజమండ్రి నగర రూపురేఖలు మార్చిన మీరు ఎమ్మెల్యేగా గెలవాలని అయోధ్యలో రాముడిని కోరనున్నట్టు ఎంపీకి తెలిపారు. బైక్స్ పై అయోధ్య వెళుతున్న ఈ యువకులను భరత్ అభినందించారు. దేశ జనాభాలో 60 శాతం మంది యువకులు ఉన్నారు.. వీరంతా దేశ పటిష్టతకు, దేశాభివృద్ధికి అడుగులు ముందుకు వేయాలన్నారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానంలో నిలిచిన యువతను స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా లక్ష్య సాధనకు కృషి చేయాలని ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు, నగర వాసులు, వైసీపీ శ్రేణులు, రామ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బైక్ రైడర్స్ కు ‘ఆల్ దీ బెస్ట్’ చెప్పారు.