ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గోదావరి జిల్లాలో తాగు నీటి సమస్య పెరుగుతోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.. గోదావరి చెంతనే ఉన్నా ఈ ప్రాంతాల్లో త్రాగునీటికి చింత తప్పడంలేదు. గోదావరి వాసులు త్రాగునీటి కోసం చేస్తున్న ఫీట్లు, మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు,
మండుతున్న ఎండలతో గోదావరి జిల్లాల ప్రజల గొంతు ఎండుతోంది. గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ట్యాంకర్లు వద్ద మంచినీళ్లు పట్టుకోవడంలోనూ, సుదూర ప్రాంతాల నుండి నీళ్లు తెచ్చుకోవడానికి వీరు చేస్తున్న ఫీట్లు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. జిల్లా కేంద్రం కాకినాడ రూరల్ మండలం రాఘవేంద్ర పురం, శివకృష్ణాకాలనీ, హోప్ ఐలాండ్ కాలనీలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఇక్కడ 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా.. ఈ ప్రాంతంలో మూడు నెలలుగా పైపుల ద్వారా రక్షిత నీటి సరఫరా నిలిచిపోయింది. అరకొరగా వస్తున్నా రంగుమారి పురుగులతో వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేసే నీళ్లపై ఆధారపడుతున్నారు. వీటి కోసం మండుటెండలో వీరు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ నీటిని పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని.. శాశ్వత పరిష్కారం చూపించాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.
Summer Heat: దంచికొడుతున్న ఎండలు.. జనం బెంబేలు