Farmers Protest: విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు ఆపేశారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తుంది. గజపతినగరం పీఏసీఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడిన గందరగోళం.. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతన్నలు రోడ్లపై బైఠాయించారు.
Read Also: Kids Mobile Usage : పిల్లలతో మొబైల్ వాడకం తగ్గించే.. 7 సింపుల్ టిప్స్
రైతుల ఆందోళన
అయితే, విజయనగం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సమస్య రైతులను ఆందోళనకు గురు చేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరికి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గజపతినగరం పీఏసీఎస్ కి యూరియా వస్తుందన సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇక, కార్యాలయం వద్ద రైతులు క్యూ లైన్లలో నిల్చొని గంటల తరబడి వేచి చూశారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని భావించిన రాజకీయ నాయకులు అక్కడికి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పెరిగిన డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాకత్ అయ్యి కొందరికే యూరియా ఇచ్చినట్టు రైతులు ఆరోపణలు చేయడంతో.. ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం..
ఇక, పీఏసీఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు అక్కడ ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే, ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక, సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, రైతులు రోడ్డుపై బైఠాయించి ట్రాక్టర్లతో రోడ్డుకు అడ్డుగా పెట్టడంతో నగరంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: IOB SO Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
యూరియా సరఫరాలో పారదర్శకత
రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని.. ప్రతి రైతుకి పాస్‌బుక్ ఆధారంగా సముచితంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తక్షణమే ఎక్కువ స్టాక్ అందుబాటులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. పంటలు కీలక దశలో ఉన్నాయి, ఇప్పుడు ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా పడిపోతుందన్నారు. ఇది ఆర్థికంగా రైతును దెబ్బతీసే కుట్ర మాత్రమే కాదు, భవిష్యత్ పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అన్నారు. ఇక, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేశారు. లేదంటే, యూరియా సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందన్నారు.