Vizianagaram: విజయనగరంలోని జనసేన పార్టీ క్యాడర్ లేబరోళ్లు, లో క్యాడర్, వేరే గ్రహాంతరాల నుంచి వచ్చిన వారిలా ఉంటారంటూ ఆ పార్టీకి చెందిన తూర్పు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ నేత ఫోన్లో మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన ఫొటోను ఫ్లెక్సీల్లో, బ్యానర్లలో వేయడం లేదంటూ సదరు మహిళ నేత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తన సొంత సామాజిక వర్గమే తనను అవమానానికి గురి చేసేలా వ్యవహరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మార్గాని భరత్!
ఇక, పదవులు ఇచ్చిన వారు, పుచ్చుకున్న వారంతా ఒకేలా వ్యవహరిస్తున్నారని, తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తన గోడు వెల్లబోసుకుంటుంది తూర్పు కాపు సామాజిక వర్గం మహిళా నేత. సిగ్గు లేకుండా చెప్పి నా ఫొటో ప్లెక్సీలలో వేయించుకోవలసిన పరిస్థితి ఉందంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయనగరంలో దరిద్రంగా ఉందని, లోక్యాడర్, లేబరోళ్లు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విజయనగరం జనసేన పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తాము త్యాగాలు చేస్తున్నాం.. అంతే కానీ, ఇలా నాయకులతో మాటలు పడటానికి కాదంటూ ఆమెను పలువురు కార్యకర్తలు విమర్శిస్తున్నారు.